ఆ మాటను నిలబెట్టుకోగలిగితే.....
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలను ప్రకటించారు. ఇందులో అతి ముఖ్యమైనది గ్రామ స్థాయిలో వలంటీర్ల నియామకం. ప్రజలు తమ పనులకు సంబంధించి స్ధానికంగానే వీరిని సంప్రదించవచ్చు. వీరు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. ఇందుకు వలంటీర్లకు నెలకు ఐదు వేల రూపాయల వేతనం అందుతుంది. ప్రజలు అర్జీలు పెట్టుకున్న 72 గంటలలో వాటిని పరిష్కరిస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు […]
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలను ప్రకటించారు. ఇందులో అతి ముఖ్యమైనది గ్రామ స్థాయిలో వలంటీర్ల నియామకం. ప్రజలు తమ పనులకు సంబంధించి స్ధానికంగానే వీరిని సంప్రదించవచ్చు. వీరు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. ఇందుకు వలంటీర్లకు నెలకు ఐదు వేల రూపాయల వేతనం అందుతుంది.
ప్రజలు అర్జీలు పెట్టుకున్న 72 గంటలలో వాటిని పరిష్కరిస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నట్టు కొత్త ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా ప్రకటించారు. అవినీతి జరిగితే నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఇక జన్మభూమి కమిటీల కథ ముగిసినట్టే. వాలంటీర్ల నియామకం అన్నది ఎంతో కీలక నిర్ణయం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం పాలు కావడానికి ఆయన నియమించిన జన్మభూమి కమిటీలే ప్రధాన కారణమనే ఆరోపణలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో కమిటీ సభ్యుల అరాచకాలు, వారు సాగించిన దాష్టీకాలు భరించలేకనే ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారనే అభిప్రాయాలున్నాయి.
పాదయాత్ర సందర్భంగా చాలా మంది జగన్ కు ఈ అరాచకాల మీదనే ఫిర్యాదు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని, అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలుపుకొంటున్నారు. నిజంగానే జగన్ కోరుకున్నట్టు వాలంటీర్లు అవినీతికి దూరంగా, జనానికి దగ్గరగా ఉండి పని చేయగలిగితే జగన్ కు ఇంతకు మించిన విజయం మరొకటి ఉండదని పరిశీలకుల అభిప్రాయం.
తమ టార్గెట్ 2024 అని జగన్ చెప్పినట్టుగా భవిష్యత్ ఎన్నికలలోనూ విజయం ఆయనకు నల్లేరు మీద నడకే అవుతుందని అంటున్నారు. అయితే దీనికి వాలంటీర్లు, అధికారులు ఏ మేరకు సహకరిస్తారో అన్నదాని మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పూర్తిస్థాయి నిఘా ఉంచి, వాలంటీర్ల పని మీద ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ ఉంటే, జగన్ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం అసాధ్యమేమీ కాదంటున్నారు.