“దేశం”లో వారసులు అవుట్..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో వారసులకు కూడా కలిసి రాలేదు. ఈసారి ఎన్నికలలో సీనియర్ నాయకులు స్వచ్ఛందంగా తప్పుకొని తమ వారసులను ఎన్నికల బరిలో నిలిపారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు దాదాపు అన్ని జిల్లాలలోనూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వారసులు పోటీ చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వారు 15 మంది వరకు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో వారసులకు కూడా కలిసి రాలేదు. ఈసారి ఎన్నికలలో సీనియర్ నాయకులు స్వచ్ఛందంగా తప్పుకొని తమ వారసులను ఎన్నికల బరిలో నిలిపారు.
అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు దాదాపు అన్ని జిల్లాలలోనూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వారసులు పోటీ చేశారు.
ఇలా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వారు 15 మంది వరకు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ తో సహా మంత్రుల తనయులు కూడా ఉండడం విశేషం. వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసారు.
టీడీపీ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష పలాస నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిమిడి మృణాలిని కుమారుడు నాగార్జున వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయాడు.
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, ఆయన కుమార్తె అదితి ఓడిపోయారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో పరాజయం పాలయ్యారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమిపాలయ్యారు.
ముఖ్యమంత్రి తనయుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి…. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్, మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు ప్రతాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతుల్లో పరాజయం పాలయ్యారు.
అనంతపురం జిల్లాలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముని కుమారుడు అశ్విత్ రెడ్డి ఓడిపోయారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత నేత పరిటాల రవి, సునీత దంపతుల కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా ఓటమి పాలయ్యారు.
మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ నగరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, సినీనటి రోజా చేతిలో ఓటమిపాలయ్యారు.
అలా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల వారసులు ఎన్నికల్లో ఓటమి పాలవడం పార్టీకి తీరని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.