పశ్చిమ టీడీపీలో రగిలిన చిచ్చు.... పక్క పార్టీల వైపు నేతల చూపు !
పశ్చిమగోదావరి టీడీపీలో ముసలం మొదలైంది. ఒక్కో నియోజకవర్గ అభ్యర్ధి పేరు లీక్ చేస్తున్నారు. దీంతో టికెట్ ఆశించిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే నరసాపురం ఎంపీ అభ్యర్ధి రఘురామకృష్ణమరాజు పార్టీ మారారు. వైసీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి కోసం వెతుకుతోంది. మాజీ మంత్రి, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొత్త పల్లి సుబ్బారాయుడిని ఎంపీగా పోటీ […]
పశ్చిమగోదావరి టీడీపీలో ముసలం మొదలైంది. ఒక్కో నియోజకవర్గ అభ్యర్ధి పేరు లీక్ చేస్తున్నారు. దీంతో టికెట్ ఆశించిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే నరసాపురం ఎంపీ అభ్యర్ధి రఘురామకృష్ణమరాజు పార్టీ మారారు. వైసీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి కోసం వెతుకుతోంది. మాజీ మంత్రి, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొత్త పల్లి సుబ్బారాయుడిని ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయాలు రంజుగా మారాయి. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు (నాని) టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బాపిరాజుకు టికెట్ ఇవ్వాలని జిల్లా నాయకత్వం చంద్రబాబుకు సూచించింది. అయితే ఆయన మాత్రం ఈలి నానికి టికెట్ ఖరారు చేశారు. దీంతో బాపిరాజు అలక వహించారు. అమరావతి నుంచి అసంతృప్తితో తాడేపల్లిగూడెం వెళ్లారు.
ఈలి నానికి టికెట్ కేటాయిస్తే కార్యకర్తలు సహకరించే పరిస్థితి లేదని బాపిరాజు స్పష్టం చేశారు. కుల సమీకరణాల పేరుతో కష్టపడిన వారిని పక్కన పెడితే కష్టమని చెప్పారు. తాడేపల్లిగూడెంలో కార్యకర్తలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. బాపిరాజు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
నిడదవోలు,పాలకొల్లు,భీమవరంతో పాటు పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఒకరికి టికెట్ వస్తే మరొక నేత సహకరించని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పశ్చిమలో విభేదాలు పార్టీ పుట్టి ముంచుతాయనే ఆందోళన టీడీపీ నేతల్లో కన్పిస్తోంది.