మాకు టికెట్లు ఇవ్వాలి: తమ్ముళ్ల బెదిరింపులు
నలబై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని వివిధ సర్వేలు నిరూపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతి జిల్లాలోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో తెలుగు తమ్ముళ్లు నుంచి కూడా తనకు సహకారం అందడం లేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు ఆడింది ఆట పాడింది పాట గా సాగింది. […]
నలబై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమని వివిధ సర్వేలు నిరూపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతి జిల్లాలోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో తెలుగు తమ్ముళ్లు నుంచి కూడా తనకు సహకారం అందడం లేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు ఆడింది ఆట పాడింది పాట గా సాగింది. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో ఓటమి పాలవడం ఖాయమని సర్వత్ర వినిపిస్తుండడంతో తమ్ముళ్లు కూడా ఆయనకు ఎదురు తిరుగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇన్నాళ్లు పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరెవరిని బరిలో దించాలి అనేది చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్పేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా తెలుగు తమ్ముళ్లు ఎదురు తిరుగుతున్నట్లు సమాచారం. తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీని ఓడించడం ఖాయమంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడికి సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అంటున్నారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు చంద్రబాబు నాయుడికి అల్టిమేటం ఇచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలో తాము చాలా పవర్ ఫుల్ అని, తమను కాదని వ్యవహరిస్తే పార్టీ ఓటమికి తాము వెనుకాడమని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్తున్నారు.
పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన చేరికతో కె.ఈ కృష్ణమూర్తి వర్గీయుల్లో అసహనం ఎక్కువైంది అంటున్నారు. కోట్లను చేర్చుకున్న చంద్రబాబు నాయుడు తమ అంగీకారం లేకుండా ఈ పని చేశారని, రానున్న ఎన్నికల్లో తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోతే ఓటమి ఖాయమంటూ పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత టిజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కూడా తనకు కర్నూలు టికెట్ కావాలని పట్టు బడుతున్నారు. కర్నూల్ లో మంచి పట్టున్న టీజీ వెంకటేష్ తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే పార్టీని ఓడించేందుకు ఎందుకైనా సిద్ధ పడతానని సన్నిహితుల వద్ద హెచ్చరించినట్లు సమాచారం.
ఇదే పరిస్థితి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో కూడా నెలకొని ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడిని తెలుగు తమ్ముళ్లు తమ హెచ్చరికలతో మరింత ఆందోళనకు గురి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.