నయీం హత్యలను సహజమరణాలు చేసిన డాక్టర్లపై పోలీసుల నజర్!
భూదందాలు, అక్రమ వసూళ్లలో భాగంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ 24 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారు.
భూదందాలు, అక్రమ వసూళ్లలో భాగంగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ 24 మంది అమాయకులను పొట్టన బెట్టుకున్నారు. నయీం చేసిన మర్డర్లకు ప్రభుత్వ డాక్టర్లు సాయమందించారన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. నయీం చిత్రహింసలు పెట్టి చంపిన వ్యక్తులను పోస్టుమార్టం చేసి హత్యలుగా నిర్ధారించాల్సిన వైద్యులు వాటిని సహజమరణాలుగా సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ కేసుల నుంచి లోకం దృష్టి మరల్చగలిగాడు.
ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. 4 హత్యల విషయంలో ప్రభుత్వడాక్టర్లు నయీంకు సహకరించారు. ఆ నాలుగు కేసుల్లో తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యులకు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
హత్యలను సహజమరణాలుగా రిపోర్టు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అన్న కోణంలో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ వైద్యులను విచారిస్తే.. వారిపై నయీం కాకుండా ఒత్తిడి తెచ్చిన ఇతర పెద్దల భండారం కూడా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నయీం ఓ శాడిస్టు. అతనికి తన గురించి తప్ప ఇతరుల గురించి అస్సలు పట్టదు. నయీం చంపినవారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీరిలో బిల్డర్లు, ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని కూడా హైదరాబాద్ లో నయీం మట్టుబెట్టాడు.
నయీం హత్యల్లో రాజకీయ నాయకులు, భూదందాల కోసం చేసినవే ఎక్కువగా ఉన్నాయి. బాధితులు పేద, మధ్య తరగతి వారైతే వారి శవాలను మాయం చేశాడు. కానీ, నయీం చంపిన 4 కేసులు మాత్రం జఠిలంగా మారాయి. ఈ 4 హత్య కేసుల్లో హతులు సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న వారు కావడం గమనార్హం. వీరి శవాలను మాయం చేసినా అది ఎంతోకాలం దాగదు. అందుకే, వీటిని సహజమరణాలుగా చూపెట్టాలి.
అప్పట్లో ఎలాగూ మంత్రులు, పోలీసుల సహకారం ఉంది. ఇక మేనేజ్ చేయాల్సింది వైద్యులు! అందుకే, వైద్యులనూ నయానో, భయానో దారికి తెచ్చుకున్నాడు. వీరందరిని చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించారు. అందుకే ప్లాన్ ప్రకారం.. రోడ్డు ప్రమాదాలు, సహజమరణాలుగా కేసులు నమోదు చేయించి పోస్టు మార్టం తంతు ముగించి చేతులు దులుపుకున్నాడు. ఈ హత్యలు జరిగాక వైద్యులను సంప్రదించాడా? లేక ముందే వారి సలహాల ప్రకారమే చంపాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.