ముందు అస్మదీయులు... తరువాతే తస్మదీయులు!
నయీం కేసులో పోలీసుల వేట మొదలైంది. ఈ విషయంలో ఎవరినీ వదలవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు దూకుడు పెంచారు. ముందుగా నల్లగొండకు చెందిన అధికార పార్టీ నేతలపై దృష్టి సారించారు. నయీంతో అధికార- ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా దందాలు సాగించారని పోలీసులు సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. దీంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఇవ్వకుండా ముందుగా అధికార పార్టీ నేతలను అరెస్టు చేయాలని సీఎం నిర్ణయించారు. తరువాత ప్రతిపక్ష […]
Advertisement
నయీం కేసులో పోలీసుల వేట మొదలైంది. ఈ విషయంలో ఎవరినీ వదలవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పోలీసులు దూకుడు పెంచారు. ముందుగా నల్లగొండకు చెందిన అధికార పార్టీ నేతలపై దృష్టి సారించారు. నయీంతో అధికార- ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అంతా దందాలు సాగించారని పోలీసులు సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. దీంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఇవ్వకుండా ముందుగా అధికార పార్టీ నేతలను అరెస్టు చేయాలని సీఎం నిర్ణయించారు. తరువాత ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకోవాలని సూచించారట. దీనివల్ల నయీం కేసులో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లు, పక్షపాతాలకు లొంగడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నంలో ఉన్నారు సీఎం. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోపు ఈకేసులో పలు సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి వాటన్నింటికీ సిద్ధమైన తరువాతే ప్రభుత్వం ఈ అరెస్టులకు ఉపక్రమించినట్లుగా అర్థమవుతోంది. ఇక అసెంబ్లీలో నేరాలకు పాల్పడిన వారి జాతకాలు చదివి వినిపించి ప్రజాక్షేత్రంలో మార్కులు సంపాదించాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
నయీం కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నయీంతో అంటకాగిన నేతల కదలికలపై పోలీసులు ఇప్పటికే డేగ కన్ను వేశారు. వారు దేశం విడిచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నేడో, రేపో వారిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నారు. దీంతో నయీంతో అంటకాగిన నేతలంతా వణికిపోతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలంతా తమను అన్యాయంగా ఇరికించారనో.. లేదా టీఆర్ ఎస్‌లో చేరడం లేదన్న అక్కసుతో ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు కొందరు ప్రజాప్రతినిధులు మొదలు పెట్టారు కూడా. ఈ కేసులో అధికార పార్టీ నేతల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పాపం! వీరు ఆరోపించేందుకు కూడా ఏమీ లేని పరిస్థితి. ఇప్పటికే పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయాలంటూ.. వీరికి పార్టీ సందేశం పంపినట్లు కూడా ప్రచారం సాగుతోంది. వీరిలో ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి జంప్ చేసినవారు కూడా ఉన్నారు. వీరి పరిస్థితి అయితే.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రతిపక్షంలో ఉంటే కక్షసాధింపు అనేందుకు అవకాశం ఉండేది.. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.
Advertisement