ఆశ " మోసం... మధ్యలో మోత్కుపల్లి

నమ్మేవాళ్లు ఉన్నంత కాలం నమ్మించేవాళ్లు… మోసపోయే వారు ఉన్నంత కాలం మోసగించేవారు ఉంటారన్నది మోత్కుపల్లి విషయంలో రుజువవుతోంది. గవర్నర్‌ కావాలన్న మోత్కుపల్లి ఆశను ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకత్వం ఆయనతో ఆటాడుకుంటోంది. చూస్తుంటే మ్యాటర్‌ మోత్కుపల్లి సీరియస్‌గా ఉన్నా… టీడీపీ నేతలకు కామెడీగా తయారైందా? అన్న అభిప్రాయం కలుగుతోంది. ఎన్నిబెదిరింపులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చంద్రబాబు మీద ఈగ వాలకుండా ఎదురుదాడి చేస్తూ మోత్కుపల్లి వస్తున్నారు. చంద్రబాబు కోసం రిస్క్‌ తీసుకుని టీఆర్‌ఎస్‌తో పోరాటం చేశారు. […]

Advertisement
Update:2016-09-01 06:29 IST

నమ్మేవాళ్లు ఉన్నంత కాలం నమ్మించేవాళ్లు… మోసపోయే వారు ఉన్నంత కాలం మోసగించేవారు ఉంటారన్నది మోత్కుపల్లి విషయంలో రుజువవుతోంది. గవర్నర్‌ కావాలన్న మోత్కుపల్లి ఆశను ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకత్వం ఆయనతో ఆటాడుకుంటోంది. చూస్తుంటే మ్యాటర్‌ మోత్కుపల్లి సీరియస్‌గా ఉన్నా… టీడీపీ నేతలకు కామెడీగా తయారైందా? అన్న అభిప్రాయం కలుగుతోంది. ఎన్నిబెదిరింపులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చంద్రబాబు మీద ఈగ వాలకుండా ఎదురుదాడి చేస్తూ మోత్కుపల్లి వస్తున్నారు. చంద్రబాబు కోసం రిస్క్‌ తీసుకుని టీఆర్‌ఎస్‌తో పోరాటం చేశారు. అలసిపోయానని, ఆర్థికంగా చితికిపోయానని పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో పోలీసులు బూటు కాళ్లతో తన్నారని వాటి నొప్పి ఇప్పటికీ ఉందని కాబట్టి తనను ఆదుకోవాలని మొన్నటి మహానాడు వేదిక మీదే మోత్కుపల్లి చంద్రబాబును వేడుకున్నారు. అదే సమయంలో మహానాడు వేదిక మీద ”గవర్నర్‌ మోత్కుపల్లి” అని చంద్రబాబు పిలిచే సరికి అప్పటి నుంచి మోత్కుపల్లి తాను గవర్నర్‌ అయిపోయినట్టేనని ఊహించుకుంటూ వచ్చారు. కానీ ప్రతిసారి మొండిచేయి, మోసం మోత్కుపల్లిని వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య పంజాబ్, మణిపూర్, అసోం, అండమాన్ నికోబార్‌లకు కొత్త గవర్నర్లను నియమించారు. అప్పుడు మోత్కుపల్లి తనకు చాన్స్ వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడు తీవ్ర ఆవేదనకు లోనైన మోత్కుపల్లిని చంద్రబాబు బృందం తమిళనాడును చూపించి సముదాయించింది.

రోశయ్య స్థానంలో గవర్నర్‌గా వెళ్లే అవకాశం ఉందని మళ్లీ గవర్నర్‌ అనే ఆశకు టీడీపీ నేతలు నీళ్లు పోశారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా కేంద్రం విద్యాసాగర్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో మోత్కుపల్లి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తనకు గవర్నర్‌ పదవి ఇప్పించే విషయంలో చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతున్నారన్న భావనకు ఆయన వచ్చేశారు. తనకు కావాల్సిన వారికి అన్ని పదవులు ఇప్పించుకుంటున్న చంద్రబాబు… తమ నేతను గవర్నర్ చేసే విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని మోత్కుపల్లి అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే మోత్కుపల్లి బలహీనత గురించి బాగా తెలుసుకున్న టీడీపీ నేతలు మరో విడత ఓదార్పు చేశారని సమాచారం. ”అప్పుడే అయిపోలేదు. విద్యాసాగర్‌రావును తమిళనాడుకు ఇన్‌చార్జ్‌గా మాత్రమే నియమించారు. పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే సమయంలో అదృష్టం మిమ్మల్లే వరించవచ్చు” అని చెప్పారట.

దీంతో మోత్కుపల్లి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారైందంటున్నారు. నిజంగా తమిళనాడుకు తనను పూర్తి స్తాయి గవర్నర్‌గా నియమిస్తారేమో తొందర పడి పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తే దాన్ని సాకుగా చూపి పదవిని ఎగ్గొడుతారేమోనని ఆలోచన చేస్తున్నారట. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం జరుగుతున్న దాన్ని చూసి నవ్వుకుంటున్నారు. మోత్కుపల్లి బలహీనతను నాయకత్వం కనిపెట్టేసిందని… కాబట్టి తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌గా మరొకరిని నియమించినా వెంటనే మరో రాష్ట్ర గవర్నర్‌ పదవిని ఆశగా చూపించి మోత్కుపల్లిని మభ్యపెడుతారని అంటున్నారు. మోత్కుపల్లికి గవర్నర్‌ పదవీ రాదు.. అలాని ఆయన పార్టీ నాయకత్వంపై తిరుగుబావుట ఎగరవేసే పరిస్థితి ఉండదంటున్నారు. కారణం చంద్రబాబుపై మోత్కుపల్లికి ఉన్న గుడ్డి నమ్మకమంటున్నారు. ఆశకు మోసానికి మధ్యలో మోత్కుపల్లి చిక్కుకుపోయారంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News