ఏడేళ్ల ముస్లిం అంధ బాలిక ...భగవద్గీత కంఠతా పట్టేసింది!
ఆ పాప వయసు ఏడేళ్లు…తనకు ఎనభై శాతం చూపు మాత్రమే ఉంది. ఆమె ముస్లిం బాలిక. కానీ కళ్లుమూసుకుని చేతులు జోడించి భగవద్గీత మొత్తం చెబుతుంది. ఆ గ్రంథాన్ని చూడనైనా చూడని ఆ పాప, మనసుతోనే గీతను నేర్చుకుని హృదయంలో నిలుపుకుంది. ఈ అద్భుతాన్ని మన కళ్లముందు నిలుపుతున్న రిదా జెహ్రా ఈ భూమ్మీద అసాధ్యమనేది లేదని, మనసుంటే మార్గముంటుందని మరొకసారి నిరూపించింది. మీరట్‌లోని జాగృతి విహార్‌లో బ్రిజ్‌మోహన్ బ్లైండ్ స్కూల్లో రిదా మూడవ తరగతి చదువుతోంది. […]
ఆ పాప వయసు ఏడేళ్లు…తనకు ఎనభై శాతం చూపు మాత్రమే ఉంది. ఆమె ముస్లిం బాలిక. కానీ కళ్లుమూసుకుని చేతులు జోడించి భగవద్గీత మొత్తం చెబుతుంది. ఆ గ్రంథాన్ని చూడనైనా చూడని ఆ పాప, మనసుతోనే గీతను నేర్చుకుని హృదయంలో నిలుపుకుంది.
ఈ అద్భుతాన్ని మన కళ్లముందు నిలుపుతున్న రిదా జెహ్రా ఈ భూమ్మీద అసాధ్యమనేది లేదని, మనసుంటే మార్గముంటుందని మరొకసారి నిరూపించింది.
మీరట్‌లోని జాగృతి విహార్‌లో బ్రిజ్‌మోహన్ బ్లైండ్ స్కూల్లో రిదా మూడవ తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం ఆమె ఆ స్కూలుకి వచ్చింది. భగవద్గీతని చూసి ఎరుగని, బ్రెయిలీ లిపిలో అయినా నేర్చుకుని ఎరుగని ఈ చిన్నారి, గీతని తన టీచర్ చెబుతుంటే విని నేర్చుకుంది. అలాగే గుర్తుపెట్టుకుంది.
ప్రపంచాన్ని చూడలేని ఈ చిన్నారికి దైవాన్ని ప్రార్థించడం చాలా ఇష్టమైన విషయం. ఖురాన్ చదివినా, గీత చదివినా తన కళ్లముందు తాను చూడలేని దైవాన్ని నిలుపుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె కూడా అదే అంటుంది. తన కళ్లముందుకు వచ్చి దైవం నిలబడినా తాను చూడలేనని, కానీ ప్రార్థన ద్వారా మనసంతా దైవాన్ని నింపుకుంటానని రిదా చెబుతోంది.
గత ఏడాది భగవద్గీత నేర్చుకునే పోటీలు జరుగుతున్నపుడు ఆ స్కూలు ప్రిన్స్‌పాల్ ప్రవీణ్ శర్మకు అనిపించింది…. తమ పిల్లలకు కూడా నేర్పించాలని. అలా ఆయన ద్వారా అక్కడి చిన్నారులకు గీత పరిచయం అయింది.
కానీ గీత, బ్రెయిలీ లిపిలో లేకపోవడంతో పండితుల వద్ద దాని ఉచ్ఛారణ నేర్చుకుని ప్రవీణ్ శర్మ, పిల్లలకోసం చదవడం మొదలుపెట్టారు. రిదా జెహ్రాలో చాలా త్వరగా నేర్చుకునే గుణం ఉందని ఆయన గుర్తించారు. కళ్లు లేకపోయినా రిదాకు జీవితాన్ని చూసే శక్తి ఉందని, ఆమెలో దేన్నయినా సాధించాలనే తపన మెండుగా ఉందని ఆయన అన్నారు.
రిదా జెహ్రా తండ్రి ఢిల్లీలో బిర్యానీ అమ్ముతుంటాడు. తన కుమార్తె ఏ మత గ్రంథాలు చదివినా తనకు అభ్యంతరం లేదని, ఇంకా ఆమెకు ఇతర మతాల గురించిన జ్ఞానం పెరగటం సంతోషమని, తన కుమార్తె విద్యావంతురాలు అయితే చాలని అతను చెబుతున్నాడు. ఏకాగ్రత, సాధన, చేస్తున్న పనిపట్ల ఇష్టం…ఇవి మనిషి జీవితానికి ఎంత ముఖ్యమో, ఇవి మనిషి జీవితంలో ఎలాంటి మిరకిల్స్ చేస్తాయో రిదా జెహ్రా నిరూపించింది.