అక్కడ పోరు పాక్‌తో కాదు...వాతావరణంతో!
సైన్యంలో పనిచేయాలంటేనే ఎంతో తెగువ, ధైర్యం ఉండాలి. ఇక సియాచిన్ హిమవత్ పర్వత ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికుల ధైర్యాన్ని, తెగింపుని మాటల్లో వర్ణించలేము. మనసులో ఎంతో గట్టి సంకల్పం లేకపోతే కేవలం జీవన భృతి కోసం మాత్రమే అయితే ఏ సైనికుడూ అక్కడ పనిచేయలేడు. మనుషులకు నివాసయోగ్యం కాని ఆ అతిశీతల ప్రాంతంలో సైనికులు 365 రోజులూ పహారా కాస్తున్నారు. నిజంగా అక్కడి వాతావరణ పరిస్థితులను గురించి తెలుసుకుంటే ఆ సైనికులు దేశ రక్షణతో పాటు అనుక్షణం […]
సైన్యంలో పనిచేయాలంటేనే ఎంతో తెగువ, ధైర్యం ఉండాలి. ఇక సియాచిన్ హిమవత్ పర్వత ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికుల ధైర్యాన్ని, తెగింపుని మాటల్లో వర్ణించలేము. మనసులో ఎంతో గట్టి సంకల్పం లేకపోతే కేవలం జీవన భృతి కోసం మాత్రమే అయితే ఏ సైనికుడూ అక్కడ పనిచేయలేడు. మనుషులకు నివాసయోగ్యం కాని ఆ అతిశీతల ప్రాంతంలో సైనికులు 365 రోజులూ పహారా కాస్తున్నారు.
నిజంగా అక్కడి వాతావరణ పరిస్థితులను గురించి తెలుసుకుంటే ఆ సైనికులు దేశ రక్షణతో పాటు అనుక్షణం తమ ప్రాణానికి తామే పహారా కాసుకోవాలని అర్ధమవుతుంది. నీటి చుక్కపడినా వెంటనే గడ్డకట్టుకుపోయే స్థితి, రాత్రయితే అరవై డిగ్రీల మైనస్‌కి పడిపోయే ఉష్ణోగ్రత. ఎప్పుడైనా మంచు కొండలు విరిగి పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం, సర్రున కోసేసే శీతల గాలులు, ఆదమరిస్తే తినేయడానికి సిద్ధంగా ఉండే గాంగ్రేయన్ వ్యాధి, చేతికి గ్లౌజ్ వేసుకోకుండా 15 సెకన్లపాటు తుపాకి ట్రిగ్గర్ పట్టుకుంటే వేళ్లు చచ్చుబడిపోయే పరిస్థితి, హెలికాప్టర్ల నుండి తాజాపళ్లు వేస్తే అవి క్షణాల్లో గడ్డకట్టుకుపోయేంత దారుణమైన శీతలం. పీల్చుకునే ఆక్సిజన్ కూడా కరువే పదిశాతం మాత్రమే దొరుకుతుంది. హెలీకాప్టర్లలో కింద పడేసిన ఆహారాన్ని మంచుతుఫాన్ల బారిన పడకుండా వేగంగా అందుకోవాలి. వేడినీళ్లలో ఉంచితే కానీ రైఫిళ్లు, మిషన్‌గన్లు పనిచేయవు. సియాచిన్ యుద్ధభూమిలో పరిస్థితులు ఇవి. అక్కడ పాక్, భారత్ సైనికుల మధ్య యుద్ధం జరగకపోయినా నిరంతరం యుద్ధమే. సైనికులు తమ ప్రాణాలను తాము కాపాడుకోవడానికి చేసే యుద్ధమది. అయినా సైన్యమక్కడ పనిచేస్తూనే ఉంది.
1984 నుండి అక్కడ పాక్, భారత సైనికులు పహారా కాస్తున్నారు. అప్పటి నుండి వందల సంఖ్యలో సైనికులు మరణిస్తున్నారు. సంవత్సరానికి మనదేశం 2,100 కోట్లు, పాక్ 700 కోట్లు ఖర్చుచేస్తున్నాయి. పర్వతాల పైన భారత్, కింద ప్రాంతాల్లో పాక్ ఆధిపత్య పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈనెల మూడో తేదీన మంచు చరియలు విరిగిపడి పదిమంది జవాన్లు ఉన్న శిబిరం పూర్తిగా మంచు పలకల కింద కూరుకుపోయింది. మంచుకింద ఏమాత్ర ఉష్ణం ఉన్నా, కదలికలు ఉన్నా గుర్తించే రాడార్ల సహాయంతో సుశిక్షితులైన 150మంది, సహాయ బృందాలుగా సైనికులకోసం వెతికారు. ఆ ప్రయత్నాల్లో అనూహ్యంగా లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్ అనే వీరజవానుని ప్రాణాలతో కనుగొన్నారు.
ఆయన బతికి ఉండటం అంతులేని ఆశ్చర్యంగా అద్భుతంగా భావిస్తున్నారు. మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇన్నిరోజులు అతను ప్రాణాలతో ఉండటం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆశ్చర్యకరమైన వార్తగా మారింది. హనుమంతప్ప ప్రస్తుతం వెంటిలేటరుమీద చికిత్స పొందుతున్నాడు. అతని కిడ్నీ, లివర్ పాడయ్యాయని, మిగిలిన అవయవాలు బాగున్నాయని వైద్యులు వెల్లడించారు. ఆయన కోలుకోవాలని దేశవ్యాప్తంగా కోరుకోని వారు ఉండరు. సాధారణ మనిషికి ఒళ్లు గగుర్పొడిచే వాతావరణంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఆ వీర జవాన్లను ఎంతగా అభినందించినా తక్కువే.
అయితే వారు భద్రతా దళాలుగా పనిచేసిన ప్రాంతం ఏ మాత్రం నివాసయోగ్యంకాదు. రెండుదేశాలకూ ఏమాత్రం పనికొచ్చే ప్రదేశమూ కాదు. సాంకేతికంగా… దేశాలు, వాటి భద్రతా వ్యూహాలు..సరిహద్దుల్లో అప్రమత్తత …ఇవన్నీఇలాగే ఉండవచ్చు. కానీ సంవత్సరాలుగా వందల సంఖ్యలో సైనికుల రూపంలో సాధారణ మనుషులు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. జీనవ పోరాటం చేస్తున్నారు. వీరజవాన్లకు జై అనడం ఉద్వేగ భరితంగానూ, ఉత్తేజపూరితంగానూ ఉంటుంది నిజమే. కానీ గాలిపీల్చుకోవడానికి కూడా వీలులేని వాతావరణంలోకి దేశానికి పహారా పేరుతో సైనికులను పంపుతున్నాం అనేది మాత్రం మరచిపోకూడని నిజంగా ఆ ప్రాంతం అంత కీలకమైనదా? లేదా ప్రజల్లో దేశ భక్తిని రెచ్చగొట్టడానికి ఉపయోగపడే ఒక తురుపుముక్కా? అనేది ఎప్పుడూ ప్రశ్నార్ధకమే!. కార్గిల్ యుద్ధం కూడా నిజంగా దేశ భద్రతకోసం అవసరమయ్యే చేశామా? అని కొందరి ప్రశ్నలకు ఎప్పడూ సమాధానం లభించదు. అయినా సియాచిన్ విషయంలో మనదేశం, పాక్ రెండూ మానవతా దృక్పథాన్ని జోడించి ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుంది కదా.