హనీమూన్‌తోనే హరీ...అంటున్న వివాహ బంధాలు!
హనీమూన్‌కి వెళ్లే జంటలు ఆ ట్రిప్‌లో ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుని ముందు జీవితానికి పటిష్టమైన బాటలు వేసుకుంటారని కదా అనుకుంటాం. కానీ మనదేశంలోని నగరాల్లో నివసించే చాలా జంటల విషయంలో అలా జరగటం లేదట. హనీమూన్ నుండి తిరిగి రాగానే చాలా జంటలు అటునుండి అటే కోర్టుకి వెళ్లి విడాకులు కోరుతున్నారని, గత మూడేళ్లుగా ఇలాంటి జంటలు ఇంకా పెరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. గత నెలలో ఒక జంట హనీమూన్ ట్రిప్‌ని పదిరోజులు ప్లాన్ చేసుకుని […]
హనీమూన్‌కి వెళ్లే జంటలు ఆ ట్రిప్‌లో ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుని ముందు జీవితానికి పటిష్టమైన బాటలు వేసుకుంటారని కదా అనుకుంటాం. కానీ మనదేశంలోని నగరాల్లో నివసించే చాలా జంటల విషయంలో అలా జరగటం లేదట. హనీమూన్ నుండి తిరిగి రాగానే చాలా జంటలు అటునుండి అటే కోర్టుకి వెళ్లి విడాకులు కోరుతున్నారని, గత మూడేళ్లుగా ఇలాంటి జంటలు ఇంకా పెరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. గత నెలలో ఒక జంట హనీమూన్ ట్రిప్‌ని పదిరోజులు ప్లాన్ చేసుకుని వెళ్లారు. మూడురోజులకే తిరిగొచ్చారు. అతనికి తనమీద ఎలాంటి ఆకర్షణ లేదని, చాలా యాంత్రికంగా ప్రవర్తించాడనేది ఆమె ఆరోపణ. అలాగనీ అతను ఇంతకుముందు ఎవరినీ ప్రేమించలేదు కూడా. కానీ అతను తన భార్యతో ప్రేమగా ఉండలేకపోయాడు. వారిద్దరూ విడాకులకు అప్లయి చేశారు. పెళ్లి తరువాత మానసిక శారీరక దగ్గరితనం పెరగకపోతే జీవితం చాలా యాంత్రికంగా కనబడుతుందని, అలా ప్రవర్తించే పాట్నర్‌ని రెండవవారు భరించలేకపోతున్నారని ఓ మ్యారేజి కౌన్సెలర్ అంటున్నారు.
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనే కాదు, ప్రేమ వివాహాల్లోనూ ఇలాగే జరుగుతోంది. గత రెండు నెలల్లోనే విచ్ఛిన్నమైన ప్రేమ వివాహాలను తాను చాలా చూసినట్టుగా ఒక న్యాయవాది తెలిపారు. ఏ మాత్రం సహనం, సర్దుకుని పోయే తత్వం లేకపోవడమే ప్రేమవివాహాల వైఫల్యంలో ఎక్కువగా కనబడుతోంది. ఒక ప్రేమ వివాహ జంట హనీమూన్ నుండి తిరిగి రాగానే విడిపోయే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు మొదటి అడుగు వేసింది అమ్మాయి. పెళ్లికి ముందు కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేశామని, అతను పెళ్లికి ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేడని అమ్మాయి చెబుతోంది. పెళ్లి తరువాత తన పనులన్నీ నేనే చేయాలని అతను ఆశిస్తున్నాడు, పైగా నా ఇష్టాయిష్టాలకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని ఆమె తన వాదనలు చెప్పుకొచ్చింది.
మనస్తత్వాల్లో తేడాలు, గతంలోని అనుబంధాలు, ఒకరి నుండి ఒకరు ఎక్కువ ఆశించడం, నిజాలు దాచడం, సెక్స్ పట్ల విముఖత ఇవన్నీ విడాకులకు ముఖ్య కారణాలుగా కనబడుతున్నాయి. ఇద్దరిలో ఉన్న ఇగో, ఆర్థిక సంబంధ విషయాలు… ప్రాథమికంగా ఉన్న సమస్యలను మరింతగా పెంచుతున్నాయి. ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం కూడా విడాకులకు దారితీస్తోంది. జీవితంలో రాజీ పడాల్సిన అంశాలు పెరుగుతున్నపుడు, ఒత్తిడి పెరుగుతున్నపుడు పెళ్లి విషయంలో కూడా రాజీ పడటం మా వల్ల కాదు… అంటోంది నేటి తరం. గత ఐదేళ్లలో సంపాదిస్తున్న మహిళలు ఎక్కువగా విడాకులకోసం వస్తున్నారని, మగవారిలో మార్పు ఆశించి అది కనిపించకపోవడంతో వారు విడాకుల బాట పడుతున్నారని ఒక లాయర్ అంటున్నారు.
వైవాహిక జీవితంలో పలు రకాల సమస్యలు రావడం సహజమే. ఆ బంధం ఒక కారు లాంటిది. కారు హాయిగా, చక్కగా నడవడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టే ఈ బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని మ్యారేజి కౌన్సిలర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా హనీమూన్ నుండి వచ్చిన వెంటనే విడాకులకోసం వెళ్లేవారు అంత తొందర పడకుండా కాస్త ఆగి ఆలోచిస్తే మంచిది.