ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్నారా?
ఆన్ లైన్ మోసం అనగానే గుర్తొచ్చేది నైజీరియన్లే. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మోసం చేయడం నైజీరియన్ల స్పెషల్. కానీ ముంబైలో ఇటీవల రొమేనియన్లు కూడా రెచ్చిపోతున్నారు. వారం రోజుల్లోనే సుమారు 35 లక్షల రూపాయలు ఏటీఎం నుంచి కాజేశారు. ఈ సంఘటన ముంబై బాంద్రా హిల్స్ ఏరియాలోని ఓ ఏటీఎంలో జరిగింది. దీంతో బాధితులంతా చుట్టుపక్కల వున్న పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వీబీ నగర్ పోలీసులు ముగ్గురు రుమేనియాకు […]
ఆన్ లైన్ మోసం అనగానే గుర్తొచ్చేది నైజీరియన్లే. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మోసం చేయడం నైజీరియన్ల స్పెషల్. కానీ ముంబైలో ఇటీవల రొమేనియన్లు కూడా రెచ్చిపోతున్నారు. వారం రోజుల్లోనే సుమారు 35 లక్షల రూపాయలు ఏటీఎం నుంచి కాజేశారు. ఈ సంఘటన ముంబై బాంద్రా హిల్స్ ఏరియాలోని ఓ ఏటీఎంలో జరిగింది. దీంతో బాధితులంతా చుట్టుపక్కల వున్న పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వీబీ నగర్ పోలీసులు ముగ్గురు రుమేనియాకు చెందిన యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న బీకేసీ సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి కూపీ లాగుతున్నారు.
అక్టోబర్ 5న బాంద్రా హిల్ రోడ్డులోని ఏటీఎంలో కొందరు స్థానికులు డబ్బులు డ్రా చేశారు. అయితే అలెన్ బౌడి, మరియన్ గ్రామా, మ్యూలోనెల్ అనే ముగ్గురు రొమేనియన్లు ఏటీఎం సెంటర్ లోని సీసీ కెమెరాను ధ్వంసం చేసి అందులో సమాచారం సేకరించి నగదు డ్రా చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సుమారు 62 ఫిర్యాదులు అందినట్టు పోలీసులు తెలిపారు.
అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం వారం రోజుల్లో ఆ ఏటీఎంలో 300మంది డబ్బు డ్రా చేశారని తెలిపారు. దీంతో మిగతా ఖాతాదారుల సమాచారం కూడా రొమేనియన్లకు తెలిసి ఉంటుందని అనుమానిస్తున్నారు. డబ్బు పోయిన వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఫిర్యాదు దారుల సంఖ్య పెరుగుతుండడంతో 90లక్షల వరకు డబ్బు డ్రా చేసి ఉంటారని వీబీ నగర్ పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నపుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మోసం చేసే వారు మాత్రం కొత్త టెక్నిక్ లతో రెచ్చిపోతున్నారు.