సభను హుందాగా నడుపుదాం: స‌్పీకర్
విధానసభలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రజలందరికీ భాగస్వామ్యం వహిస్తున్నామన్న విషయం మరిచిపోరాదని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. తాను 1983లో తొలిసారి సభకు వచ్చినపుడు సభ ఎంతో హుందాగా ఉండేదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేవారని, ఈనాటి సభను చూస్తే చాలా బాధ కలుగుతుందని అన్నారు. తాను పక్షపాతంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. వైకాపా సభ్యులపై ప్రభుత్వం ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులనుద్దేశించి కొంతసేపు స్పీకర్ మాట్లాడారు. పాత సభ్యులకు, కొత్త సభ్యులకు […]
విధానసభలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రజలందరికీ భాగస్వామ్యం వహిస్తున్నామన్న విషయం మరిచిపోరాదని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. తాను 1983లో తొలిసారి సభకు వచ్చినపుడు సభ ఎంతో హుందాగా ఉండేదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేవారని, ఈనాటి సభను చూస్తే చాలా బాధ కలుగుతుందని అన్నారు. తాను పక్షపాతంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. వైకాపా సభ్యులపై ప్రభుత్వం ఇచ్చిన సభా హక్కుల నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులనుద్దేశించి కొంతసేపు స్పీకర్ మాట్లాడారు. పాత సభ్యులకు, కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే సభలోని పార్టీలకున్న సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయించాల్సి ఉంటుందని కోడెల తెలిపారు. పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం తనకు లేదని, సభలో ఉండగా తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానా లేదా అన్నదే ఆలోచించాలని, తాను కూడా ప్రతి క్షణం ఆత్మ విమర్శ చేసుకుంటానని, డాక్టర్‌గా ఉన్నప్పుడు కూడా నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా అని ఆలోచించేవాడినని తెలిపారు. మనం చేస్తున్న ప్రతి పనీ ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్న విషయం మరిచిపోరాదని, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు మొదలైన తర్వాత అసెంబ్లీలో వాడే భాష, బాడీ లాంగ్వేజ్, హావభావాలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారని ఈ విషయం సభ్యులు గుర్తించాలని కోరారు. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నందున దీన్ని పొడిగించవద్దని, ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్న వారినుద్దేశించి స్పీకర్ అన్నారు. ఇకముందు అంతా కలిసి సాగుదామని అన్నారు. అసెంబ్లీని హుందాగా కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ కోరారు. తానెప్పుడూ ఏకపక్షంగా వ్యవహరించనని, తాను తప్పు చేశానని అనుకుంటే ఒక్క క్షణం కూడా స్పీకర్ స్థానంలో ఉండనని కోడెల స్పష్టం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న తనను, తన కార్యదర్శిని కూడా దూషించడం తగదని, సభలో మీకు న్యాయం జరగలేదంటే అది సాంకేతికంగా ఉండే పరిస్థితులే తప్ప పక్షపాతం కాదని కోడెల వివరణ ఇచ్చారు. మనం ప్రవర్తించే తీరు, మాట్లాడే మాటలు ఆడవారు వింటే సిగ్గు పడతారని, జరిగిందేదో జరిగిపోయింది, ఇకముందైనా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకుండా సభ్యులు హూందాగా వ్యవహరించాలని స్పీకర్ కోరారు. – పి.ఆర్.