వేసవిలో మెరిసే చర్మం కోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి
సమ్మర్లో విరివిగా దొరికే కొన్ని పండ్లు తినడం వల్లనే కాదు.. చర్మానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మండే వేసవి చర్మంపై బాగా ఎఫెక్ట్ చూపుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమట, ఎండ కారణంగా.. మొటిమలు, టాన్, పిగ్మెంటేషన్, జుడ్డు వంటి సవాలక్ష సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చర్మం తాజాదనాన్ని కోల్పోయినట్టు కనిపిస్తుంది. వేసవిలో చర్మాని మరింత కేర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి రిఫ్రెష్ ఫేస్ ప్యాక్‌లు సహాయపడతాయి.
సమ్మర్లో విరివిగా దొరికే కొన్ని పండ్లు తినడం వల్లనే కాదు.. చర్మానికి ఫేస్ ప్యాక్‌గా కూడా వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, నేచురల్ యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇవి చర్మాన్ని యంగ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. సో వేసవి కాలంలో కూడా అందంగా మెరవాలంటే.. ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి.
కీరా, కలబంద..
ఈ రెండింటిలో కూలింగ్, హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి వేసవిలో చర్మ సంరక్షణకు సహాయపడతాయి. సగం కీరాను గుజ్జుగా చేసి.. దాని రసం ఫిల్టర్ చేసుకోండి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కలబంద గుజ్జును మిక్స్ చేయండి. ఈ మిక్స్‌ను ముఖానికి ఫ్యాక్‌లా అప్లై చేయండి.
బొప్పాయి, తేనె..
బొప్పాయిలో మీ చర్మానికి అద్భుతాలు చేసే విటమిన్లు, ఎంజైమ్‌లు మెండుగా ఉంటాయి. పండిన బొప్పాయిని మెత్తగా చేసి, దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి, మెడకు అప్లై చేసి.. 15-20 నిమిషాల పాటు దానిని ఆరనిచ్చి కడిగేయండి.
పుచ్చకాయ, పెరుగు ..
రిఫ్రెష్ ఫేస్ ప్యాక్ కోసం పచ్చకాయ గుజ్జును పేస్ట్‌గా చేసి.. దానిలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడకు అప్లై చేసి 20 నిమిషాల పారు ఆరనివ్వండి. పుచ్చకాయ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, టోన్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగు మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
యాపిల్ నారింజ..
కొన్ని యాపిల్, నారింజ ముక్కలను మిక్సీ చేయండి. దానికి కొంచెం పసుపు, పాలు కలపండి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్, చర్మానికి పోషణనిస్తుంది.
మామిడి, పెరుగు ఫేస్ ప్యాక్
మామిడిలో ఉండే విటమిన్ సి, ఇ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తాయి. కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. పెరుగును దానికి జోడిస్తే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఈ ప్యాక్ కోసం పండిన మామిడి గుజ్జును తీసుకుని, పెరుగుతో కలపండి. దీన్ని నేరుగా ముఖంపై రుద్దండి. ఇది ముఖంలోని మురికిని తొలగిస్తుంది, అడ్డుపడే రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.