కాంగ్రెస్ తెలంగాణకు శనిలా దాపురించింది

హామీలు, గ్యారంటీలకు గాలికొదిలేసింది.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు : ఎమ్మెల్సీ కవిత

Advertisement
Update:2024-12-30 16:41 IST

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పాలిట శనిలా దాపురించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు అన్యాయం, మోసానికి గురవుతున్నారని అన్నారు. కల్లిబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్దు ష్టపరిపాలనకు తెరతీసిందన్నారు. రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేయలేదని.. ఇప్పుడు రైతు భరోసాకు అనేక షరతులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న విషయం డీజీపీ వెల్లడించిన క్రైమ్‌ రికార్డులు స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రశ్నించే గొంతులు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పదేళ్లపాటు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని తెలపారు. రైతుబంధు ఇవ్వాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రైతు కూలీలు, మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ప్రతీ మూడు గంటలకు ఒక మహిళపై ఒక అత్యాచారం జరుగుతోందని, ప్రతీ ఐదు గంటలకు ఒక మహిళా కిడ్నాప్ అవుతోందని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఈ గణాంకాలే చెప్తున్నాయని అన్నారు. మహిళల భద్రత కోసం కేసీఆర్‌ షీ టీమ్స్‌ ఏర్పాటు చేస్తే.. రేవంత్‌ రెడ్డి మహిళల భద్రతను గాలికొదిలేశారని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతలు చుట్టూ తిరగడం తప్పా ఏం చేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగమంటూ తిరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రెండు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయని, తుపాకీ మోతలు ఉండొద్దన్న లక్ష్యంతో కేసీఆర్‌ పాలన చేస్తే.. ఇవాళ రేవంత్ రెడ్డి శాంతి భద్రతలకు భగ్నం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తోందన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పెండింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు.

రైతులను నరకయాతన పెట్టడానికే ఈ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో రీసర్వే చేసే ముందు భూముల వివరాలు తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రీసర్వే పేరితో ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరొకరి పేరు మీద రాసే ప్రమాదముందన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారని, వాళ్లు బీఆర్ఎస్‌ వై పు చూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ వేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ జిల్లా అనాథగా మారిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నుంచి కనీసం ఒక మంత్రి కూడా లేరని, ఎంపీ ఉన్నా లేనట్టేనని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదన్నారు. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలిపారు. ఆరు నెలల నుంచి నిజామాబాద్ కు పోలీసు కమిషనర్ లేకపోవడం దారుణమన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జాతీయ నాయకుడని చెప్పుకునే షబ్బీర్ అలీ ఇక్కడి నుంచే ఉన్నా కనీసం కమిషనర్ ను నియమించకపోవడాన్ని ప్రజల గమనించాలన్నారు. ఏడాదికాలంలో ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు ఇవ్వలేదని, ఒక్క కొత్త పని చేయలేదన్నారు.

ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని, మేడిగడ్డ విషయంలో కేసీఆర్ ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో నిరుడు ఎస్సారెస్పీ ఆయకట్టు ఎండబెట్టారని ధ్వజమెత్తారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ పై ఆలోచన లేదు, పట్టి లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇష్టానుసారంగా ఇసుక దందా జరుగుతోందని విమర్శించారు. ఇప్పుడు మైనింగ్ శాఖ ఆదాయం తగ్గింది.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుకు దోపిడీని అడ్డుకుంటామని ప్రకటించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి బీఆర్‌ఎస్‌ 3.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని, ఇంకా 2.75 లక్షల మంది రుణాలు మాఫీ కాలేదన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి నిధులు విడుదల చేసి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కమిటీలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్ లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమని, బుల్డోజర్ తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరించడం మంచిది కాదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు ఆయేషా, విఠల్ రావు, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్‌ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News