గురుకుల విద్యార్థి శైలజ కుటుంబానికి రూ.2 లక్షల సాయం

యువతను రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి మోసం చేశారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Advertisement
Update:2024-12-06 20:02 IST

వాంకిడి గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌తో మృతిచెందిన విద్యార్థి శైలజ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శైలజ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల తెలంగాణ జాగృతి నాయకుల సమావేశంలో, ఆసిఫాబాద్‌ జిల్లా నాయకుడు చంద్రశేఖర్‌ శుక్రవారం కవిత దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే తాను వాంకిడిలో పర్యటించి శైలజ కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని తెలిపారు. ప్రభుత్వం శైలజ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని కవిత మండిపడ్డారు. యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్య జ్యోతుల పథకం కింద ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు వాటి పేరే ఎత్తడం లేదన్నారు. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న బీసీలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి.. అందరికీ ఫీ రీయింబర్స్‌మెంట్‌ ఎగ్గొట్టారని తెలిపారు. ఉద్యోగ నియామకాలపై రేవంత్‌ కాకిలెక్కలు చెప్తున్నారని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, లీటర్‌ పెట్రోల్‌ రూ.40కే ఇస్తామన్న హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై నిలదీయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News