తెలంగాణ అస్తిత్వాన్ని ఒక్క జీవోతో మార్చలేరు
బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని ప్రజల భావోద్వేగాలను ఒక్క జీవోతో మార్చలేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పంచామృతాలు, పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అలాంటి అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వ ఉత్తర్వులతో మార్చలేరని తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతిక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా ? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందని ప్రశ్నించారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు.
తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ అందులో మహిళలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కవులు, కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడ అన్నారు. “విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి మీకు గుర్తుకు రాలేదా ? మహిళలకు ఏమో విగ్రహాలు.. పురుషులకేమో వరాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయమని, సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వరా అని నిలదీశారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని సీఎం అంటున్నారని, అంటే తెలంగాణలో కూలినాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా అని ప్రశ్నించారు. వాళ్లు గొప్ప వాళ్ల కావాలని అనుకోవద్దా అని నిలదీశారు. బతుకమ్మతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడంతో ప్రజల మనసులు నొచ్చుకున్నాయన్నారు. తన ప్రసంగంలో ఒక్క సామాన్య మహిళల పేరు కూడా తీయని సీఎంను ఎలా నమ్మాలో చెప్పాలన్నారు. సెక్రటేరియట్లో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులను అమవానించొద్దని ముఖ్యమంత్రికి సూచించారు. తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవ్వరు కూడా బాగుపడలేదని.. ''ఆ విషయం నీ గురువు చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఆయన దగ్గర నుంచి నేర్చుకో” అన్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్ కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలు పెంచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల మీద పోలీసులు దాష్టీకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని అన్నారు. ఒకపక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి.. పేదింటి తల్లులైన ఆశా వర్కర్ల మీద దాష్టీకాలు, దాడులు చేయించారని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.