వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Advertisement
Update:2024-04-01 09:29 IST

వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు అప్పుడే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబోయే తల్లులు.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. ఈ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటూ , పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై కూడా శ్రద్ధ వహించాలి. ప్రినేటల్ కేర్‌లో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. పిండం ఎదుగుదలకు, కణజాలాల పెరుగుదలకు, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి యాంటీబాడీస్‌ ఉత్పత్తి చేయడానికి.. ప్రొటీన్‌ చాలా అవసరం. ప్రొటీన్‌ కడుపులోని బిడ్డ అస్థిపంజరం, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది. గుడ్డులో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. కోలిన్, లుటిన్, విటమిన్‌ B12, D, రిబోఫ్లావిన్, ఫోలేట్ వంటి పోషకాలూ గుడ్డులో మెండుగా ఉంటాయి. ఇవి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడతాయి.

తాజా ఆకుకూరల్లో.. విటమిన్‌ సి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో.. మలబద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఫైబర్‌ మలబద్ధక సమస్యకు చెక్‌ పెడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు తమ డైట్ లో సలాడ్స్‌, కూరల్లో ఆకుకూరలు చేర్చుకోవాలి.

కార్బోహైడ్రేట్లు పొందడానికి, ప్రెగ్నెన్సీ సమయంలో.. తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. తృణధాన్యాలు.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి. అలాగే ఈ సమయంలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ లిపిడ్స్‌ చాలా ముఖ్యం. ఈ హెల్తీ ఫ్యాట్స్‌ శిశువు మెదడు, కళ్లు, మావి ఇతర కణజాలాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నట్స్‌, విత్తనాలలో హెల్తీ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో బాదం, పిస్తా, అవిసె గింజలు, వెరుశనగలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పండ్లలో ఉండే విటమిన్‌ సీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే నాన్‌వెజిటేరియన్స్‌ వారి డైట్‌లో చేపలు చేర్చుకోవచ్చు. చేపలలో ప్రొటీన్‌, ఐరన్‌, జింక్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చేపల్లో పిండం ఎదుగుదలకు సహాయపడే మినరల్స్‌ మెండుగా ఉంటాయి. శిశువు మెదడు పెరుగుదలకు సహాయపడే.. డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ (DHA)తో సహా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

వీటితో పాటూ గర్భిణీలు స్పైసి ఆహారానికి దూరంగా ఉండడం, ఉదయం 10 గంటల తరువాత బయట తిరగక పోవడం శ్రేయస్కరం. అలాగే ఎక్కువగా కాటన్ దుస్తులు, లూజుగా ఉండే దుస్తులు ధరించాలి.

 

Tags:    
Advertisement

Similar News