అది మారిటల్ రేప్... సెక్స్ సీన్ కాదు... నటి మెహరీన్ ఆవేదన

ఇటీవలే ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్ తో మెహరీన్ తొలిసారి ఓటిటిల్లోకి ప్రవేశించింది. అందులో ఆమె నటించిన పాత్ర... వైవాహిక అత్యాచారాన్ని ఎదుర్కొనే సన్నివేశం ఉంది. దానిని అభ్యంతరకరమైన సెక్స్ సీన్ గా అభివర్ణిస్తూ ప్రధాన, సోషల్ మీడియాలు విమర్శించాయి. దీనిపై స్పందించిన మెహరీన్ ఆ సన్నివేశాన్ని అలా చూడటాన్ని తప్పుపడుతూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

Advertisement
Update:2023-11-02 20:00 IST

అది మారిటల్ రేప్... సెక్స్ సీన్ కాదు... నటి మెహరీన్ ఆవేదన

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇటీవలి నివేదిక ప్రకారం మనదేశంలో జీవిత భాగస్వామిపై మగవారి లైంగిక హింస చాలా తీవ్రస్థాయిలో ఉంది. 2021 వరకు వెల్లడైన గణాంకాల ప్రకారం 18నుండి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహత స్త్రీలలో 83 శాతం మంది తమ వైవాహిక జీవితంలో ప్రస్తుత జీవిత భాగస్వామి చేత లైంగిక హింసకు గురయ్యారు. 13.7శాతం మంది మహిళలు తమ మాజీ భర్తల కారణంగా ఇదే హింసని ఎదుర్కొన్నారు. 1992నుండి 2021 వరకు ఐదు విడతలుగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ అంశంపై గణాంకాలను ప్రచురించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం మనదేశంలో 18నుండి 49 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒక రూపంలో జీవితభాగస్వామి చేత హింసకు గురవుతున్నారు. సుమారు ఆరుశాతం మంది లైంగిక హింసని ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఒక మారిటల్ రేప్ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మారిటల్ రేప్ ని సాధారణ విషయంగా పరిగణించడం అలవాటుగా మారిపోయిన మనదేశంలో ఆ తరహా సీన్లు సినిమాలో లేదా వెబ్ సిరీస్ లో కనబడితే... వాటిని ప్రేక్షకులు సవ్యంగా అర్థం చేసుకుంటారని చెప్పలేము. ఒక వెబ్ సిరీస్ విషయంలో అదే జరిగింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మెహరీన్ అందులో నటించింది. క్రూరమైన ఆ నేరాన్ని ప్రేక్షకులు తక్కువ చేసి చూస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవలే ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ అనే వెబ్ సిరీస్ తో మెహరీన్ తొలిసారి ఓటిటిల్లోకి ప్రవేశించింది. అందులో ఆమె నటించిన పాత్ర... వైవాహిక అత్యాచారాన్ని ఎదుర్కొనే సన్నివేశం ఉంది. దానిని అభ్యంతరకరమైన సెక్స్ సీన్ గా అభివర్ణిస్తూ ప్రధాన, సోషల్ మీడియాలు విమర్శించాయి. దీనిపై స్పందించిన మెహరీన్ ఆ సన్నివేశాన్ని అలా చూడటాన్ని తప్పుపడుతూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో మెహరీన్ పాత్రపేరు సంజన. అందులో ఆమెపై చాలా క్రూరమైన మారిటల్ రేప్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. దానిని అభ్యంతరకరమైన సెక్స్ సీన్ గా మీడియా చూడటాన్ని వ్యతిరేకించిన మెహరీన్... ఈ సన్నివేశంలోని వాస్తవాన్ని గుర్తించకుండా దానిని అసభ్యకరమైన సన్నివేశంగా మాత్రమే చూడటం తనను చాలా బాధించిందని, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్త్రీలు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన సమస్యని తక్కువ చేసి చూస్తున్నారని తన పోస్టులో పేర్కొంది. అందులో ఆమె వెల్లడించిన మరిన్ని భావాలు ఇలా ఉన్నాయి...

‘ప్రధాన, సోషల్ మీడియాల్లో కొంతమంది వ్యక్తులు మారిటల్ రేప్ ని సెక్స్ సీన్ గా చూడటం నన్ను చాలా బాధించింది. తమ కుటుంబాల్లో కూడా కుమార్తెలు, అక్క చెల్లెళ్లు ఉంటారనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. ఆ మహిళల జీవితాల్లో అలాంటి హింస ఎప్పుడూ ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ విధమైన హింస క్రూరత్వాలను ఆలోచనల్లో కూడా భరించలేము. నటిగా నేను నా పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నాను. దర్శకుడు ఇతర టీమ్ సభ్యులు అందరూ... మేము కష్టతరమైన సన్నివేశాల్లో నటిస్తున్నపుడు మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వృత్తిపరమైన నిబద్ధత చూపారు. మహాలక్ష్మి, సంజన, హనీ... పాత్ర ఏదైనా ప్రేక్షకులకు నచ్చేలా నటించాననుకుంటున్నాను’ అంటూ మెహరీన్ తన పోస్టులో రాసుకొచ్చింది. ఆమె అభిప్రాయాలకు మద్ధతు ఇస్తూ పలువురు నెటిజన్లు పాజిటివ్ గా స్పందించారు.

Tags:    
Advertisement

Similar News