నా తండ్రిని చంపిన‌ట్టే.. నన్ను కూడా కుట్ర చేసి చంపాలని చూస్తున్నారు : వైఎస్ షర్మిల

నేను చేస్తున్న పాదయాత్రతో ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ప్రజా సమస్యలు బయటకు రావడమే కాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం అర్థం అవుతుంది. అందుకే వైఎస్ఆర్టీపీని కట్టడి చేయడానికి కుట్ర చేస్తున్నారు

Advertisement
Update:2022-09-18 12:38 IST

`నా తండ్రి వైఎస్ఆర్‌ను కుట్ర చేసి చంపారు.. ఇప్పుడు నన్ను కూడా అలాగే చంపాలని చూస్తున్నారు` అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పులిబిడ్డనని.. కేసులు పెడితే భయపడేది లేదని.. దమ్ముంటే అరెస్టు చేయమని ఆమె సవాలు విసిరారు. వనపర్తిలో పాదయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. `నేను చేస్తున్న పాదయాత్రతో ప్రజల్లో అభిమానం పెరుగుతోంది. ప్రజా సమస్యలు బయటకు రావడమే కాకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం అర్థం అవుతుంది. అందుకే వైఎస్ఆర్టీపీని కట్టడి చేయడానికి కుట్ర చేస్తున్నారు` అని షర్మిల ఆరోపించారు. నన్ను అరెస్టు చేసి పాదయాత్ర ఆపాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

`కేసీఆర్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ఆయనకు తెలిసింది అదొక్కటే. మీ బెదిరింపులకు భయపడే మ‌నిషిని కాదు. నాపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేయగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే మేము నిరంజన్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. నన్ను మరదలు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పట్టించుకోవద్దా? తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా` అని ష‌ర్మిల మండిపడ్డారు. తెలంగాణలో మంత్రులపై కేసులు పెట్టకూడదా? ఆ విషయం నేరుగా చెప్పండి. మంత్రుల మీద కేసులు పెడితే మేం ఎఫ్ఐఆర్ న‌మోదు చేయమని పోలీసులు క్లారిటీ ఇవ్వమనండి అని షర్మిల అన్నారు. వైఎస్సార్ కూతురినైన నేను ఫిర్యాదు చేస్తేనే పట్టించుకోవడం లేదు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీకి ఆర్ఎస్ఎస్‌లా.. టీఆర్ఎస్‌కు పోలీస్ శాఖ ఓ సైన్యంలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ శాఖను టీఆర్ఎస్‌లో విలీనం చేయండి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నా గొంతు నొక్కడం, నన్ను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. మీతో పోలీసులు ఉంటే.. నాతో జనం ఉన్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏ మహిళనైనా అడగండి. ఎవరు బడితే వాళ్లు మరదలు అని అంటే చెప్పుతో కొడతారా లేదా అని. రైతుల మీద ప్రేమలేని వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. ఆయన రైతులను సినిమా టికెట్లతో పోల్చారని షర్మిల విమర్శించారు.

కాగా ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కించపర్చేలా షర్మిల వ్యాఖ్యానించారంటూ స్పీకర్, డీజీపీకి ఫిర్యాదు చేశారు. షర్మిలపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. అయితే.. సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసినా తాను తగ్గబోనని షర్మిల వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News