పసుపు బోర్డు ప్రకటన బీజేపీ కార్యక్రమంలా చేశారు : ఎమ్మెల్సీ కవిత
రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రకటన విధానం సరిగా లేదని ఆమె తెలిపారు. రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని కవిత వెల్లడించారు. నిజామాబాద్ లో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిని రాజకీయ కోణంలోనే ప్రకటన చేశారన్నారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయమైతే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కోసం బీఆర్ఎస్ పార్టీయే పోరాటం చేసిందన్నారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడే పసుపు బోర్డు కోసం కృషి చేశానన్నారు. నిజామాబాద్‌కు విమానాశ్రయం తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీ అర్వింద్‌పై ఉందన్నారు. పసుపుకు మద్దతు ధర. దిగుమతుల నియంత్రణ కోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. దిగుమతులు పెరిగితే బీజేపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని నిలదీశారు. పసుపు బోర్డు ఏర్పాటు తోనే సమస్యలు అన్నీ పరిష్కారం కావని వివరించారు. స్పై సెస్ బోర్డు బెంజ్ కారు లాంటిదని, ..పసుపు బోర్డు అంబాసిడర్ కారులంటి దని ఎంపీ అర్వింధ్ అన్నారన్నారు. ఒక వేళ బెంజ్ కారు ఉంటే, అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చారు.? అంటూ చురకలు అంటించారు కవిత. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లోనే లేరని ఆమె అన్నారు.