విజయమ్మను అవినాష్ రెడ్డి కలవడం వెనుక కారణం అదేనా..?
ప్రస్తుతం వైఎస్ సునీతతో మంచి సంబంధాలు కలిగిన వారిలో వైఎస్ విజయమ్మ ఒకరు. ఈ నేపథ్యంలోనే తన తప్పులేదు అని వివరణ ఇచ్చేందుకు విజయమ్మను అవినాష్ రెడ్డి కలిసి ఉంటారన్న చర్చ నడుస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ఎదుట కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం వద్ద వైఎస్ విజయమ్మను అవినాష్ రెడ్డి ప్రత్యేకంగా కలవడం చర్చనీయాంశమైంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వీరి మధ్య చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వివేకా హత్య తర్వాత వైఎస్ ఫ్యామిలీలో ఒక విధమైన చీలిక ఏర్పడింది. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల.. వివేకా కుమార్తె సునీత రెడ్డికి మద్దతుగా ఉంటున్నారని ప్రచారం ఉంది. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి అన్నది వారి ఆలోచన. వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ.. సునీత అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులే హత్య చేసి ఉండవచ్చని కూడా చెప్పారు.
పరోక్షంగా వైఎస్ అవినాష్ రెడ్డి, అతడి తండ్రి భాస్కర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను షర్మిల కూడా సమర్థించారు. ప్రస్తుతం ఈ కేసులో ఎంత దూరమైనా పోరాటం చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ సునీత ఉన్నారు. ఆమె గురి ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి పైనే ఉంది. ప్రస్తుతం వైఎస్ సునీతతో మంచి సంబంధాలు కలిగిన వారిలో వైఎస్ విజయమ్మ ఒకరు. ఈ నేపథ్యంలోనే తన తప్పులేదు అని వివరణ ఇచ్చేందుకు విజయమ్మను అవినాష్ రెడ్డి కలిసి ఉంటారన్న చర్చ నడుస్తోంది.
ఒక దశలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు వైఎస్ సునీత కుటుంబంపైనే ఎదురు దాడికి దిగారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక అతడి అల్లుడు, కుమార్తె హస్తముందని పత్రికల్లో రాయించారు. అయితే వివేకానంద రెడ్డి కుమార్తె, అల్లుడే ఆ హత్య చేయించి ఉంటారన్న ప్రచారం ఎక్కువ కాలం నిలవలేదు . అందుకు కారణం ఒకవేళ వివేకానంద రెడ్డి అల్లుడే ఈ హత్య చేయించి ఉంటే .. మరి హత్యాస్థలిలోని రక్తపు మరకలను శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు దగ్గరుండి ఎందుకు తుడిపించారు అన్న ప్రశ్న తలెత్తింది. దానికి తోడు వివేకానంద రెడ్డి తలపై ఉన్న గొడ్డలిపోట్లకు వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంపౌండర్ ను పిలిపించి శవానికి వీరందరూ కలిసి ఎందుకు కుట్లు వేయించారు అన్నది కూడా ప్రధానంగా తెరపైకి వచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎక్కువగా అనుమానాలు రావడానికి కూడా నెత్తుటి మరకలు శుభ్రపరచడం, మృతదేహానికి కుట్లు వేయించే ప్రయత్నాలు చేయించడం వంటివే కారణం.