హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు - హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది.
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ అవార్డు గెల్చుకుంది. పచ్చదనంలో హైదరాబాలో జరిగిన అభివృద్ది ఈ అవార్డుకు కారణం. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం (AIPH) వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022 ను దక్షిణ కొరియాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు నగరానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
ఈ అవార్డు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హర్షం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు.
ఇది హైదరాబాద్ కే కాక భారత దేశానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణతో సహా దేశ ఖ్యాతిని పెంచిందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తోందనడానికి ఈ అవార్డులే నిదర్శనమని అన్నారు.
హరితహారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పర్యావరణ విధానాలు ప్రపంచ హరిత వేదికపై భారతదేశం గర్వించేలా చేశాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు.