పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ?

మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ఎమ్మెల్సీ కవిత ఫైర్‌;

Advertisement
Update:2025-03-11 13:00 IST

నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. క్వింటాలు పసుపుకు ₹15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. పసుపుకు కనీసం ₹ 9 వేలు రాని పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన, మోసం చేయడమేనని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని విమర్శించారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైంది ? అని నిలదీశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ₹ 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన

అటు జగిత్యాల జిల్లాలోనూ పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. క్వింటా పసుపు పంటకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో వివిధ గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు పాదయాత్ర చేశారు. పాత బస్టాండ్‌ వద్ద బైఠాయించి పసుపు రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముత్యంపేటలోని చెక్కర కర్మాగారాన్ని తెరిపించాలని ఆందోళన చేపట్టారు. మెట్‌ పల్లి నేషనల్‌ హైవేపై బైటాయించి ధర్నా చేస్తున్నారు. షుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన భూములను కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News