ఏడాదిలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పు
ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి చేసిన అప్పు రూ. 6.36 లక్షల కోట్లకు చేరుతుందన్న హరీశ్
ఆర్‌బీఐ వివరాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పుచేసిందని ఆరోపించారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొన్నది. శాసనసభ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మొదటి ఏడాదిలోనే 1.27 లక్షల కోట్ల అప్పుచేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి చేసిన అప్పు రూ. 6.36 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని ఫైర్ అయ్యారు. తమ హయాంలో రూ. 4,17,496 కోట్ల అప్పు చేస్తే.. రూ. 7 లక్షల కోట్ల పైచిలుకు అంటూ గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు తెలిపారు. అప్పుల అంశంపై సభలో ప్రత్యేక చర్చ చేపట్టాలని హరీశ్ డిమాండ్ చేశాడు. హామీలు నెరవేర్చడం తమకు సమస్యే కాదని ఎన్నికలకు ముందు చెప్పారని.. ఇప్పుడు అప్పుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు.