అంతుబట్టని కేసీఆర్ స్ట్రాటజీ.. మునుగోడుపై వరాలు జల్లు ఎందుకు లేదు?
మునుగోడులో ప్రజాదీవెన పేరుతో సీఎం కేసీఆర్ అగస్టు 20న భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడు ఆయన ప్రసంగం అంతా సాదా సీదాగానే సాగిపోయింది. ఒక్క వరం కూడా మునుగోడు నియోజకవర్గంపై కురిపించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలంగాణలో ఉపఎన్నికలు రావడం అనేది కొత్త విషయం కాదు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంతో మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో గెలుపొందారు. ఇక ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన ఉపఎన్నిక తీరే వేరుగా ఉంది. ముఖ్యంగా దుబ్బాక, హూజూరాబాద్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య యుద్దాన్నే తలపించింది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు భారీగా వరాల జల్లు కురిపించారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ భారీగా వరాల జల్లు కురిపించారు. దళిత బంధు కోసం రూ. 2,000 కోట్లు, అభివృద్ధి పనులకు మరో రూ. 600 కోట్లు కేటాయించారు.
ఉపఎన్నిక ఎక్కడ జరిగినా సీఎం కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు సాంక్షన్ చేయడమే కాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు ప్రకటించేవారు. కానీ, మునుగోడు ఉపఎన్నికలో మాత్రం అలాంటి ఊసే లేదు. ఒక ప్రాజెక్టు గానీ, ఒక కాలేజీ కానీ, ఒక పథకం కానీ ప్రకటించలేదు. భారీగా నిధులు ఇస్తామని కూడా చెప్పలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునుగోడులో ప్రజాదీవెన పేరుతో సీఎం కేసీఆర్ అగస్టు 20న భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడు ఆయన ప్రసంగం అంతా సాదా సీదాగానే సాగిపోయింది. ఒక్క వరం కూడా మునుగోడు నియోజకవర్గంపై కురిపించలేదు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాను రాజీనామా చేస్తే మునుగోడుకు సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రకటిస్తారు, వరాల జల్లు కురిపిస్తారు అంటూ రాజగోపాల్ మొదటి నుంచి ప్రచారం చేసుకున్నారు. తన రాజీనామాతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన మొదటి నుంచి చెప్పుకున్నారు. తీరా రాజీనామా తర్వాత కేసీఆర్ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. సీఎం కేసీఆర్ ఫోకస్ మొత్తం బీఆర్ఎస్ మీద పెట్టారు. ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు స్వయంగా లేఖలు రాయాలని నిర్ణయించారు. తప్ప మునుగోడుకు కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. మునుగోడు పరిధిలో కొత్తగా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బస్టాండ్ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ, కేసీఆర్ దానికి సంబంధింన ప్రకటన కూడా చేయలేదు.
ఈ నెల 30 లేదా 31న సీఎం కేసీఆర్ మరోసారి మునుగోడు నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం లేదు. అంటే మొత్తానికి భారీ ప్రకటనలు ఏవీ లేకుండానే మునుగోడు ఉపఎన్నికను కానిచ్చేస్తున్నారు. దీని వెనుక గతంలో తగిలిన ఎదురు దెబ్బలే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. హుజూరాబాద్‌లో భారీగా నిధులు, పథకాలు ప్రకటించడంతో.. అవన్నీ ఈటల రాజీనామా కారణంగానే వచ్చాయని ఓటర్లు భావించారు. అది టీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టాన్ని తీసుకొని వచ్చింది. అందుకే కొత్తగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా.. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, పథకాల అమలును ప్రజలకు తెలియజేస్తే చాలని కేసీఆర్ భావించారు. అందుకే పార్టీ శ్రేణులు కూడా ఓటర్లు దగ్గరకు వెళ్లినప్పుడు పథకాల అమలుకు సంబంధించి ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఒకే సారి ఒకే నియోజకవర్గంపై భారీగా నిధులు కుమ్మరించడం వల్ల రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్తున్నట్లు కేసీఆర్ గ్రహించారు. అందుకే ఇకపై ఉపఎన్నికల్లో అలాంటి తప్పులు చేయకూడదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటే చాలని.. కొత్తగా వరాలు కురిపించడం ద్వారా.. అసలు ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేయలేదనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని కూడా కేసీఆర్ అంచనా వేశారు. అందుకే మునుగోడు ఎన్నికల విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఉపఎన్నికలతో పోలిస్తే దీన్ని చాలా భిన్నంగా టీఆర్ఎస్ డీల్ చేస్తోంది. రాజగోపాల్ స్వార్థం వల్లే ఎన్నికలు వచ్చాయని, ఆయనకు రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిన తర్వాత బీజేపీలో చేరారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అవే రూ. 18 వేల కోట్లు నల్గొండ జిల్లాకు కేటాయిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని టీఆర్ఎస్ సవాలు విసరడం గతంలో ఎన్నడూ చూడని పార్శమని విశ్లేషకులు అంటున్నారు.