కోర్టులపై రేవంత్‌ కు ఎందుకు అపనమ్మకం

పేదోళ్ల ఇండ్లు కూలగొట్టే దుర్మార్గపు ప్రభుత్వం తప్పించుకోలేదు : ఎంపీ ఈటల రాజేందర్‌

Advertisement
Update:2024-09-23 20:14 IST

సీఎం రేవంత్ రెడ్డికి కోర్టులపై ఎందుకు అపనమ్మకమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. అందుకే శనివారం, ఆదివారం చూసుకొని హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కూకట్‌ పల్లిలోని నల్లచెరువు పరిసరాల్లో గల హైడ్రా కూల్చివేతలను సోమవారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లచెరువు రికార్డ్స్‌ ప్రకారం 19 ఎకరాలు కాగా, మధ్యలో సర్వే చేసి 27 ఎకరాలను అని నిర్దారించి రికార్డుల్లో చేర్చారని తెలిపారు. చెరువు భూముల్లో 7.36 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి కాగా మిగతా మొత్తం పట్టా భూములని, చెరువు నీళ్లు తగ్గినప్పుడు రైతులు ఆ భూములు దున్నుకునే వారని తెలిపారు. ఒకానొక సమయంలో కూకట్‌పల్లిలో రూ.వెయ్యికి ఎకరం భూమి అమ్మే వారని, పన్నులు కట్టలేక కొందరు భూములు వదిలేసుకున్నారని తెలిపారు. తర్వాత భూముల విలువ పెరిగిందన్నారు. నల్ల చెరువు నింపడానికి పైన ఎలాంటి వాగులు లేవని, ఈ చెరువు మత్తడిలోనే ప్రభుత్వం కమ్యూనిటీ హాల్‌ నిర్మించి తనే నిబంధనలు ఉల్లంఘించిందన్నారు. శనివారం, ఆదివారం వచ్చిందంటే బుల్డోజర్లు బయటికి వచ్చి పేదల గూడు కూలగొడుతున్నాయని అన్నారు. మిగతా రోజుల్లో కోర్టులు అడ్డుకుంటాయనే బుల్డోజర్లను బయటికి రానివ్వడం లేదన్నారు. కోర్టులు అనాలోచితంగా ఉంటాయా? జడ్జీలు, చట్టాల మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు. జడ్జీలు, కోర్టులు మానవత్వంతో ఆలోచిస్తాయని అన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టి, ఆస్తులు ధ్వంసం చేసే దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కువ కాలం తప్పించుకోలేదన్నారు.

సామాన్యుల బతుకుల్లో మట్టికట్టి, వాళ్ల జీవితాల్లో నిప్పులు పోసి ఏం సాధిస్తావని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏం మానవత్వం ఉంది.. ఇండ్లు కూల్చేస్తున్న వాళ్ల కన్నీళ్లు, శాపనార్థాలు తకకుండా పోవని హెచ్చరించారు. యుద్ధంలో ప్రత్యర్థులను నిర్దయగా చంపినట్టే.. పేదల గూడు ప్రభుత్వం నిర్దయగా కూల్చేస్తుందని అన్నారు. దీన్ని తెలంగాణ సమాజం అస్యహించుకుంటోందన్నారు. పేదల షెడ్లను కూల్చడంతో పాటు అందులోని సామగ్రిని బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నారని, అంటే ఎంత కక్ష, ద్వేషపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. ''తెలంగాణ రేవంత్‌ తాత జాగీరు లెక్క.. నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా.. ఇంతకు ముందు ప్రభుత్వాలు లేనట్టుగా.. ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి నువ్వే పట్టించుకున్నట్టుగా చేస్తున్నావు.. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాను.. నేను స్థానిక ఎంపీని.. ఈరోజు అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని, తాత జాగీర్ లాగా ఏది పడితే అది చేస్తే చెల్లదు బిడ్డ. చరిత్రలో ఇలాంటివారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు.. ప్రజలు తలుచుకుంటే వారి కన్నీళ్లలో కొట్టుకుపోతావు'' అని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఈ హైదరాబాద్‌ లో చెరువులు మాయం అవడానికి కారణమెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. బతుకమ్మ కుంటను ఎవరు మాయం చేశారు.. చెరువులను పూడ్చి కృష్ణ కాంత్ పార్క్‌, మాసబ్ ట్యాంక్ క్రికెట్ గ్రౌండ్ చేశారని గుర్తు చేశారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌, ప్యారడైజ్‌ బిర్యానీ సెంటర్‌ ఎఫ్‌టీఎల్‌ లోనే ఉన్నాయని.. వాటి జోలికి పోయే సాహసం చేయని ముఖ్యమంత్రి చిన్నవాళ్ల జోలికి మాత్రమే వస్తున్నారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News