ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు?
మహిళా నేతపై అసభ్యంగా మాట్లాడిన బీజేపీ నేతను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది అన్న భట్టి
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల పట్ల గౌరవ మర్యాదలున్న అందరూ ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనాయకత్వం క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం ఏ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ మేరకు ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు.
క్షణకావేశంలో పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని తెలుసుకున్నాను. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో మాట్లాడాను. విషయం తెలియగానే సీఎం, పీసీసీ అధ్యక్షుడు కూడా ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మనది గాంధేయ వాదం. దాడులు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదన్నారు. ఇదే కాదు.. ఏ రకమైనా దాడులనూ కాంగ్రెస్ ప్రోత్సహించదు. తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతున్నది. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం మా బాధ్యత అని భట్టి అన్నారు.
లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా ఒక్కటే. ఏ పార్టీ అయినా సరే.. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నదనిపిస్తే ప్రజల్లోకి వెళ్లాలి. అభిప్రాయాలు వ్యక్తపరచాలి. ఇలాంటి దాడులకు మాత్రం దిగవద్దు. అసలు విషయం తెలుసుకోకుండా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యురాలు, ఒక మహిళపై బీజేపీ నేత ఇష్టానుసారంగా మాట్లాడితే.. బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేస్తున్నది? తప్పు ఎవరు చేసినా తప్పే.. ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? అసభ్యంగా మాట్లాడిన బీజేపీ నేతను ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది అని వ్యాఖ్యానించారు.