ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చెక్ పెడుతుంది ఎవరు?
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మొదటి నుంచి హరీశ్‌రావు వర్గపు మనిషిగా ముద్రపడ్డారు. కేసీఆర్‌కు మహిపాల్ రెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. పార్టీలో ఆ మధ్య హరీశ్ రావుకు ప్రాధాన్యత తగ్గడంతో మహిపాల్ కూడా సైలెంట్ అయ్యారు.
తెలంగాణలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్‌ను గద్దె దించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే ఇటీవల చేసిన పలు సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీనే మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమనే నివేదికలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ వర్గాల్లో ధీమా అమాంతంగా పెరిగిపోయింది. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పార్టీ ఇమేజ్‌ను చెడగొడుతున్నట్లే కనపడుతోంది. మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు సెగ్మెంట్లలో గ్రూపు తగాదాలు ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా తగాదాలు రచ్చకెక్కాయి.
హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినా ఇది మెదక్ జిల్లాలో ఉన్నది. దీంతో ఇక్కడి రాజకీయాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎనిమిదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి అంతా తానై నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ సిట్టింగులకు సీట్లు ఇస్తానని చెప్పడంతో మహిపాల్ రెడ్డి మరోసారి టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. కానీ ఆయనకు పార్టీలోని ఓ వర్గం చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మొదటి నుంచి హరీశ్‌రావు వర్గపు మనిషిగా ముద్రపడ్డారు. కేసీఆర్‌కు మహిపాల్ రెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. పార్టీలో ఆ మధ్య హరీశ్ రావుకు ప్రాధాన్యత తగ్గడంతో మహిపాల్ కూడా సైలెంట్ అయ్యారు. అదే సమయంలో యువకుడైన నీలం మధు పటాన్‌చెరు సెగ్మెంట్‌లో పలు కార్యక్రమాలు చేస్తూ దూకుడు పెంచారు. హరీశ్ రావు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా నీలం మధు తన కార్యక్రమాలను ఆపలేదు. ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలతో పాటు సొంత ఖర్చులతో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. మహిపాల్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకించకపోయినా.. స్వతంత్రంగా ఎదగడానికి నీలం మధు ప్రయత్నం చేశారు.
నీలం మధు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితుడు అనే ప్రచారం నియోజకవర్గంలో జరిగింది. స్వతహాగా యువతను ప్రోత్సహించే కేటీఆర్.. నీలం మధు విషయంలో కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. దీంతో స్థానికులు కూడా నీలం మధు మంత్రి కేటీఆర్ మనిషనే నమ్ముతున్నారు. మధు వివాదాలకు దూరంగా ఉండటం, యువకుడు కావడంతో టీఆర్ఎస్‌లోని యువ క్యాడర్ ఆయన వైపు మొగ్గు చూపింది. దీంతో మధు, మహిపాల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి.
మహిపాల్ రెడ్డి గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ స్థానికులను పట్టించుకోక పోవడం, దురుసుగా ప్రవర్తించడం మీడియాలో హైలైట్ అయ్యింది. అదే సమయంలో మధు జనాలతో కలిసిపోవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటంతో ఆయనకు ఆదరణ పెరిగింది. మధు ఇప్పటి వరకు తాను కేటీఆర్ మనిషిని అని, టికెట్ తనకే వస్తుందని బహిరంగంగా చెప్పలేదు. అయితే, రాబోయే ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి పోటీ చేసేది మధునే అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మధు చేస్తున్న కార్యక్రమాలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి. ఆయన చేస్తున్న సమాజసేవ తప్పకుండా టికెట్ తెచ్చిపెడుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
కాగా, నియోజకవర్గంలో మధు దూకుడు పెరగడంతో మహిపాల్ రెడ్డి తన తప్పును తెలుసుకున్నారు. గతంతో దూకుడుగా వ్యవహరించిన మహిపాల్.. ఇప్పడు ప్రతీ ఒక్కరినీ దగ్గరకు తీస్తున్నారు. మహిపాల్ సోదరుడు కూడా ఇంటింటికీ తిరుగుతూ అసంతృప్తి కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. ఎవరైనా సహాయం కోసం వస్తే కాదనకుండా చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో పట్టించుకోని రోడ్ల మరమ్మతులు కూడా చేపిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మధును సైడ్ చేయడానికే ఎమ్మెల్యే మహిపాల్ ఇవన్నీ చేస్తున్నారని, ఇన్నాళ్లూ తమ అభ్యర్థనలను కూడా ఆయన పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మరి ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.