ఈడీ నుంచి కాంగ్రెస్‌ నాయకులను రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?

ఈ దాడులపై బీజేపీ నేతల మౌనమెందుకు ? : కేటీఆర్‌

Advertisement
Update:2024-10-13 22:40 IST

ఈడీ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను రక్షిస్తున్న పెద్దన్న ఎవరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతున్న ఆ రెండు పార్టీలు తెలంగాణలో అంటకాగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ నాయకులపై ఈడీ దాడులు జరిగినా బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఫిక్షన్‌ కంటే వాస్తవం వింతగా ఉంటుందని అంటారని, రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే అది నమ్మక తప్పడం లేదన్నారు. రాష్ట్రంలోనే సంపన్నుడైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంటిపై రెండు వారాల క్రితం ఈడీ దాడి చేసిందని, ఆ దాడిలో రూ.వందల కోట్లు స్వాధీనం చేసుకున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు. ఈడీ దాడి చేసిన రెండు వారాల తర్వాత కూడా దీనిపై ఒక్క మాట కూడా బయటకు రాలేదన్నారు. కర్నాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌ లో రూ.40 కోట్లు తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ తరలించి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఈడీ స్వయంగా వెల్లడించిందని, ఈ కేసులోనూ ఎలాంటి చర్యలు లేవన్నారు. నిధుల దారి మళ్లింపుపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ రెండు ఘటనల్లో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్నది ఎవరు అనే సందేహాలు బలపడుతున్నాయని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News