వాళ్లమీద బుల్డోజర్లు ఎక్కించి మూసీ ప్రాజెక్టు చేపడుత

ఈ ప్రాజెక్టు అడ్డకుంటే కేసీఆర్ కుక్క చావు చస్తడు : సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-08 19:09 IST

''బుల్డోజర్లకు అడ్డం పడతామంటున్న వాళ్ల పేర్లు ఇవ్వండి.. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు ఎక్కించకపోతే నేను పేరు మార్చుకుంటా.. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా.. మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తా..'' అని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్‌, హరీశ్‌ రావును ఉద్దేశించి శుక్రవారం మూసీ పర్యటనలో సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసీ వెంబడి కొంతసేపు రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేసి అక్కడి రైతులనుద్దేశించి మాట్లాడారు. ''నీ బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే... మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా.. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్‌.. మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నవ్.. నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ... మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారు.. మూసీని అడ్డుకోవాలని చూస్తే కేసీఆర్‌ కుక్క చావు చస్తావ్‌.. వాళ్ల అవినీతి కోసం.. వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నరు.. మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది.. ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. బిల్లా రంగాలకు సవాల్ విసురుతున్న.. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతా.. బిల్లా రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం..'' అని సవాల్‌ విసిరారు.

ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతోందన్నారు. పాలకులు పగ పట్టారో.. దేవుడు శాపం పెట్టిండో అని మూసీ ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. మూసీని పునరుజ్జీవింప చేయాలని వారు కోరుతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బతికే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడి పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఒకనాడు పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదన్నారు. అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారని అన్నారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోందని, అందుకే మూసీ ప్రక్షాళన చేయాలో లేదో ఆలోచించాలన్నారు. మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు కానీ మనం మూసీని బాగుచేసుకోవద్దా అని ప్రశ్నించారు. ఇది తన జన్మదినం కాదని, ఇక్కడికి రావడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ''సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్న.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..'' అని స్పష్టం చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News