కాంగ్రెస్‌ విషయంలో.. కేటీఆర్‌ చెప్పిందే నిజమవుతుందా..?

మొదటి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని అసంతృప్తులంతా గాంధీభవన్‌పైకి దండెత్తుతున్నారు. గాంధీభవన్‌ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

Advertisement
Update:2023-10-17 08:38 IST

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తే.. గాంధీభవన్‌లో తన్నులాటే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ మాట ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. కాంగ్రెస్ మొదటి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టికెట్ దక్కని అసంతృప్తులంతా గాంధీభవన్‌పైకి దండెత్తుతున్నారు. గాంధీభవన్‌ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పార్టీపై దుమ్మెత్తిపోస్తూ రాజీనామాలు చేస్తున్నారు.

అసంతృప్తుల ఆందోళనలు భరించలేక.. గాంధీభవన్‌కు సిబ్బంది తాళాలు వేసుకున్నారంటే.. పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన హరివర్ధన్ రెడ్డి అనుచరులు సోమవారం గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో గాంధీభవన్‌ గేటుకు తాళాలు వేశారు సిబ్బంది. ఆగ్రహం వ్యక్తం చేసిన హరివర్ధన్ రెడ్డి అనుచరులు ఓ దశలో గేటు తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు.

కాంగ్రెస్‌ ప్రకటించిన 55 స్థానాల్లో చాలా వరకు ఎలాంటి ఇబ్బంది లేనివే ఉన్నాయి. వివాదం ఉన్న స్థానాలను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్‌. ఈ స్థానాల్లో టికెట్‌ కోసం ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో రెండో జాబితా విడుదల చేస్తే గాంధీభవన్‌ రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కొత్తగా వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడం కూడా వివాదానికి ఆజ్యం పోసింది. ఉప్పల్‌, మేడ్చల్‌, గద్వాల్‌, నాగర్ కర్నూల్‌, కల్వకుర్తి లాంటి స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వివాదాస్పదమైంది. మరీ ఈ పరిస్థితిని హస్తం పార్టీ ఎలా చక్కదిద్దుతోందనేది వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News