విజన్ 2050తో వరంగల్ మాస్టర్ ప్లాన్
గ్రేటర్ వరంగల్ సమీక్ష సమావేశంలో మంత్రులు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2050 నాటికి నగరంలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి ఆలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెగా టెక్స్‌టైల్ పార్క్, మామునూరు ఎయిర్ పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై మంత్రులు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లకు అవసరమైన భూ సేకరణ వెంటనే పూర్తి చేయాలన్నారు. 41 కి.మీ.ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును మూడు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. భద్రకాళి చెరువు విస్తీర్ణం 382 ఎకరాలని.. మొత్తం చెరువును పునరుద్దరించాలన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో స్థానికులకు తప్పనిసరిగా ఉద్యోగాలు ఇచ్చేలా కంపెనీలతో చర్చలు జరపాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె. నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఆర్ అండ్ బీ సెక్రటరి హరిచందన, హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు సత్యశారద, ప్రావిణ్య, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.