హరీష్ రావు ప్రశ్నలకు ఉత్తమ్ జవాబు

కేంద్రం విడుదల చేసిన మినిట్స్ లో పొరపాట్లు ఉన్నాయని, అందుకే ఈ అనుమానాలు మొదలయ్యాయని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Advertisement
Update:2024-01-20 16:01 IST

ఉమ్మడి ప్రాజెక్ట్ లు కేంద్రం చేతుల్లోకి వెళ్తున్నాయని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్లే ఉమ్మడి ప్రాజెక్ట్ లపై KRMBకి పెత్తనం అప్పగిస్తున్నారని ఆరోపించారాయన. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు కాంగ్రెస్ స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వివరణ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే కేంద్రం విడుదల చేసిన మినిట్స్ లో పొరపాట్లు ఉన్నాయని, అందుకే ఈ అనుమానాలు మొదలయ్యాయని చెప్పారాయన.

అసలేం జరిగింది..?

ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖతో జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల కింద 15 అవుట్‌లెట్లను కేంద్రానికి అప్పగించే విషయంపై చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సమావేశంలో పాల్గొన్న తెలంగాణ అధికారులు బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే కేంద్రం విడుదల చేసిన సమావేశం మినిట్స్ లో మాత్రం తెలంగాణ ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టుగా ఉంది. దీంతో కలకలం మొదలైంది. గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన చేయగా కేసీఆర్ ససేమిరా అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అన్ని అధికారాలు అప్పగిస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. ఆయన విమర్శలతో కాంగ్రెస్ ఇరుకున పడింది. వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. అయితే తప్పంతా కేంద్రానిదేనంటున్నారాయన. తప్పుడు మినిట్స్ తో గందరగోళం నెలకొందని వివరణ ఇచ్చారు.

రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఇప్పటికీ జరగలేదని, ట్రిబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా 50 శాతం నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు నీటిని పంచాలని, ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన అంశాలను అపెక్స్‌ కౌన్సిల్‌ కు నివేదించాలని ఈ సమావేశంలో అధికారులు స్పష్టం చేసినట్టు చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆపరేషనల్‌ ప్రొటోకాల్స్‌ సంపూర్ణంగా తెలంగాణకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అప్పగింతకు అంగీకరిస్తామని చెప్పారాయన. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ రాజీ పడదని చెప్పారు ఉత్తమ్. 

Tags:    
Advertisement

Similar News