తెలంగాణకు రూ.18,114 కోట్లతో రెండు రైల్వే ప్రాజెక్టులు

తెలంగాణలో ప్రతిపాదిత రీజనర్ రింగ్ రోడ్ అవతల, దానికి సమాంతరంగా నిర్మించనున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కోసం రూ.12,408 కోట్లు, పటాన్‌చెరు-అదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ కోసం రూ.5,706 కోట్లట కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Update:2023-09-07 05:31 IST

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను కేటాయించింది. ఇందులో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో పాటు పటాన్‌చెరు-అదిలాబాద్ రైల్వే లైన్ ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం రైల్వే శాఖ రూ.18,114 కోట్లను ఖర్చు చేయనున్నది. తెలంగాణలో ప్రతిపాదిత రీజనర్ రింగ్ రోడ్ అవతల, దానికి సమాంతరంగా నిర్మించనున్న ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కోసం రూ.12,408 కోట్లు, పటాన్‌చెరు-అదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ కోసం రూ.5,706 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం విజయవాడ-సికింద్రాబాద్, కర్నూలు-కాచిగూడ, వాడి-హైదరాబాద్, మనోహరాబాద్-సికింద్రాబాద్ లైన్ల మీద భారీగా భారం పడుతోంది. ట్రాఫిక్ పెరిగిపోవడంతో రైళ్లను టైమ్ ప్రకారం నడిపించలేకపోతున్నారు. ముఖ్యంగా కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే రైళ్లను నగరం వెలుపల ఆపేయాల్సి వస్తోంది. నగరంలోని ట్రాక్‌ల మీదుగా గూడ్సు రైళ్లను నడపాల్సి రావడంతో లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్లకు కూడా ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్‌కు అవతల నగరం చుట్టూ ఒక రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు.

వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేత, గజ్వేల్, భువనగిరి, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ మీదుగా మళ్లీ వికారాబాద్‌ను కలిపే విధంగా అవుటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ రింగ్‌రైలు మార్గంలో వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి వంటి ముఖ్యమైన పట్టణాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాలకు రవాణా సౌకర్యం మరింతగా పెరిగే అకాశం ఉన్నది. ఈ ప్రాజెక్టు వల్ల శాటిలైట్ టౌన్ షిప్స్, పారిశ్రామిక ప్రాంతాలకు మల్టీమోడల్ కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ నుంచి అదనపు సబర్బన్ రైలు సేవలు కూడా పెంచే అవకాశం ఉన్నది. ఈ రీజనల్ రింగ్ రైలు మార్గం దాదాదపు 560 కిలోమీటర్లు ఉండనున్నది. ఇక పటాన్‌చెరు-ఆదిలాబాద్ మధ్య 317 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కూడా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడనున్నది. ఈ రైల్వే లైన్ సంగారెడ్డి, అల్లాదుర్గ్, నిజాంసాగర్, బాన్సువాడ, నుస్రుల్లాబాద్, రుద్రూర్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌ వరకు వెళ్లనున్నది. కొత్త ప్రాంతాలతో రాజధాని హైదరాబాద్‌కు రైల్వే కనెక్టివిటీ పెరగనున్నది.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే నగరం నుంచి 90 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ రైల్వే సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. కేవలం ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుందని.. దగ్గర్లోని గ్రామాల నుంచి కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను నగరానికి అత్యంత వేగంగా, చౌకగా చేరవేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News