పాల్ లేని లోటు తీరుస్తున్న పవన్..
దేశంలో 31 మంది బీసీ ముఖ్యమంత్రులున్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అంటూ పవన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల బరి నుంచి సడన్ గా కేఏపాల్ మాయమయ్యారు. తమ పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తు కేటాయించలేదని అలిగారు. ఈసీకి కంప్లయింట్ చేసిన అనంతరం ఆయన మీడియాకి కూడా కనపడ్డంలేదు. అయితే ఇప్పుడు ఆ లోటు భర్తీ చేసేందుకంటూ పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. వరంగల్ సభలో పవన్ ప్రసంగం విన్న తర్వాత దాదాపుగా అందరిదీ ఇదే అభిప్రాయం. దేశంలో 31మంది బీసీ ముఖ్యమంత్రులున్న ఏకైక జాతీయ పార్టీ బీజేపీ అంటూ పవన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ పై ట్రోలింగ్..
వరంగల్ సభ తర్వాత పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. నాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి నేడు అమరుల బలిదానాల గురించి పవన్ ఎలా మాట్లాడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రకటన తర్వాత భోజనం మానేశానని చెప్పిన పవన్, ఇప్పుడు తెలంగాణపై లేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీకి పదేళ్లు అవకాశం ఇవ్వాలని తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్ ని ప్రశ్నించలేదని చెప్పిన పవన్.. 2014లోనే తెలంగాణ వ్యతిరేకులతో చేతులు కలిపారని విమర్శిస్తున్నారు.
ఏపీలో కౌంటర్లు..
ఇటు ఏపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. వరంగల్ సభలో ఏపీలో అవినీతి అని ప్రస్తావించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీ గురించి ప్రస్తావన ఎందుకంటున్నారు. అదే సమయంలో కనీసం కేసీఆర్ పేరెత్తడానికి కూడా పవన్ భయపడ్డారని, ఇక ఆయన ప్రచారం చేయడం ఎందుకని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తూ జనసేన అభ్యర్థుల ప్రచారాని కంటే ముందు బీజేపీ అభ్యర్థుల కోసం వెళ్లిన పవన్, మరోసారి ప్యాకేజీ స్టార్ అనిపించుకున్నారని కౌంటర్లిచ్చారు. మొత్తమ్మీద ఒకే ఒక్క మీటింగ్ తో పవన్ కల్యాణ్, నెటిజన్లకు బాగానే టార్గెట్ అయ్యారు. రెండు రోజుల సభలు పూర్తయ్యేనాటికి ఆయన ప్రసంగాలు మరింత కలకలం సృష్టించే అవకాశముంది.
♦