మోదీ గుజరాత్ ప్రధానా..? భారత్ ప్రధానా..?

రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దామంటే తమకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని, కనీసం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ అయినా పోరాట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Update:2022-07-27 18:24 IST

మోదీ గుజరాత్‌ కే ప్రధానా.. లేక భారత దేశం మొత్తానికి ప్రధానా అని నిలదీశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గుజరాత్ లో వరదలు వస్తే, వేల కోట్లు ఇస్తారని, తెలంగాణను మాత్రం కేంద్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కిషన్ రెడ్డి సహా ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా.. కేసీఆర్ ఇల్లు వదలడం లేదన్నారు. ప్రధానిని ప్రశ్నించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, ఢిల్లీ వెళ్లినా ఆయన ఇల్లు దాటడంలేదని చెప్పారు.

ఫొటోలకు ఫోజులేనా..?

తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాడాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు కేవలం విపక్షాల వెనక దాక్కుని పోరాటం అని చెబుతున్నారని, ఫొటోలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దామంటే తమకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని, కనీసం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ అయినా పోరాట కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఢిల్లీ నుంచి ఆయన వెనుతిరగాలని, లేదంటే మోదీతో లాలూచీ పడ్డట్టు భావించాల్సి ఉంటుందన్నారు.

కేసీఆర్ ఢిల్లీ వెళ్లింది ఎందుకు..?

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, అధిక వర్షాలు వరదలుగా మారాయని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని, కానీ ఇక్కడ అది జరగడంలేదని అన్నారు రేవంత్ రెడ్డి. వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తమకు సమాచారముందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 1400 కోట్ల నష్టం అంటూ రిపోర్ట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీకి వెళ్లారంటే.. ప్రధానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారని అనుకున్నామని, కానీ ఆయన సొంత పార్టీ ఎంపీలకే టైమ్ కేటాయించలేకపోతున్నారని, జాతీయ పార్టీ ఏర్పాట్లలో బిజీ అయిపోయారని, తెలంగాణ వరద కష్టాలను పక్కనపెట్టారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News