అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే రేపటికి ఉభయ సభలు వాయిదా;
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే రేపటికి ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై నేటి బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మరుసటి రోజు చర్చిస్తారు. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ, 18న బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ నెల 19న డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్ర మార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ణు ప్రవేశపెడుతారని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో ప్రతిపక్ష నేత నేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీజేపీ సిద్ధమైంది. ఈ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్వాగతం
బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ వద్దకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన చేరుకున్నారు. శాసనసభ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు,, ఎమ్మెల్సీలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.