ఆ కట్టడాలు కూల్చక తప్పదు

హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌హ కీలక ప్రకటన

Advertisement
Update:2024-12-18 16:20 IST

నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా ఏర్పడకముందే అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జులై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదు. ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదు. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయి. అనుమతులు రద్దయినా నిర్మాణాలు జరుగుతుంటే అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తామన్నారు.

పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్‌ గ్రాబర్స్‌ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. మల్లంపేట కొత్వాల్‌ చెరువు, అమీన్‌పూర్‌లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలే. ఎఫ్‌టీఎల్‌ మార్కింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు మొదలుపెడతామన్నారు. ఐదు నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్తున్నదన్నారు.

లోటుపాట్ల ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తున్నది. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టింది. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుంది. గత 5 నెలల్లో హైడ్రా సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నదని రంగనాథ్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News