ఒత్తిడి ఉంది.. తెలంగాణలో పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం : పవన్ కల్యాణ్
తెలంగాణలో పోటీ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని సమావేశానికి హాజరైన నాయకులు, ఆశావహకులు కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే విషయంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి ఉందని.. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆశావహుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వకూడదనే ఉద్దేశంతో 2018లో పోటీ చేయలేదు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజ్ఞప్తి మేరకు బరిలోకి దిగలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సారి తప్పకుండా పోటీ చేయాలని చాలా మంది కోరుతున్నారు. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేజేతులారా ఆపుకున్నట్లే అని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు పోటీలో లేకపోతే భవిష్యత్‌లో ప్రజల వద్దకు బలంగా వెళ్లడం కష్టమవుతుందని, క్యాడర్ కూడా నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను తాను అర్థం చేసుకోగలనని.. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే అని చెప్పారు. నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను తప్పకుండా గౌరవిస్తారని పవన్ అన్నారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి తనకు ఒకటి రెండు రోజుల సమయం అవసరం అని అన్నారు.
కాగా, తెలంగాణలో పోటీ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని సమావేశానికి హాజరైన నాయకులు, ఆశావహులు కోరారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు ఈ నిర్ణయమే కీలకంగా మారుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గవద్దని వారు పవన్‌ను కోరారు.