తెలంగాణ రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది.. అసెంబ్లీ ఎన్నికలపై నారాయణ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మాకు తెలంగాణలో ఇంకో ఆప్షన్ వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని నారాయణ చెప్పారు.

Advertisement
Update:2023-05-14 15:39 IST

తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై తమకు ఒక స్పష్టత వచ్చినట్లు సీపీఐ నారాయణ చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి అవమానం జరిగిందని.. ఇంత దిగజారిన ప్రధానిని తాను ఎన్నడూ చూడలేదు.. ఇకపై చూడబోనంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణ భారత దేశంలో బీజేపీకి గేట్లు మూసేసారని.. ఇవి దేశానికే దిక్సూచి లాంటి ఫలితాలని ఆయన అన్నారు. ఒక లౌకిక దేశానికి ప్రధానిగా ఉంటూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టారని.. ఆయన ప్రధానిగా ఉండటానికి అనర్హుడని నారాయణ వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మాకు తెలంగాణలో ఇంకో ఆప్షన్ వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని అంచానా వేశారు. ఇక్కడ మాకో కొత్త ఆప్షన్ వచ్చింది. మేమేం రాజకీయ సన్యాసం తీసుకోలేదు.. మాకు కూడా సీట్లు కావాలని నారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ ఇంకా జాయింట్ యాక్షన్‌లోకి రావడం లేదని.. కొన్ని రోజులు వేచి చూస్తామని స్పష్టం చేశారు.

కొన్నాళ్లు చూసిన తర్వాత మేమే మా భాగస్వామిని ఎంచుకుంటామని నారాయణ చెప్పారు. త్వరలో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ పొత్తులపై చర్చ చేస్తామని నారాయణ అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తప్పకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని చెప్పారు. ఆ ఫలితాల కారణంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ప్రదర్శన చూపింది. ఇది తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వస్తుందని నారాయణ అంచనా వేశారు.

Tags:    
Advertisement

Similar News