రైతు భరోసా ఎగవేతల మోసంపై అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త!

వంచనను గ్రహించి ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన వేళ ఇది..! ఇప్పుడు మేల్కోకపోతే భరోసా వుండదు ..గోస మాత్రమే మిగులుతుందన్న కేటీఆర్‌

Advertisement
Update:2024-12-22 17:05 IST

అన్నదాతలారా… రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించండి! ఆంక్షలు.. కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తుచేయండి! ప్రతి ఎకరాకు.. ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టండి! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతన్నలకు బహిరంగ లేఖ లేఖ రాశారు.  

తెలంగాణ రైతన్నలకు వందనం..!

నిన్న శాసనసభలో రైతు భరోసా మీద జరిగిన చర్చను మీరు చూసే వుంటారు! రైతు భరోసా పైనా ఏమీ చెప్పకుండా..ఎటూ తేల్చకుండా సంబంధంలేని అంశాలపైకి చర్చను మళ్లించి అసలు సంగతిని అతి తెలివితో పక్కదారి పట్టించాడు ముఖ్యమంత్రి! బాగా అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మిక్కులను ప్రదర్శించాడు! రైతు భరోసా పథకంపైన ఆంక్షలు.. అనుమానాలు.. సందేహాలు వేటికి సమాధానం చెప్పకుండా దాట వేసింది ప్రభుత్వం!

అంతేకాదు.. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుబంధు పథకంపై పచ్చి అబద్ధాలతో కూడిన దుష్ప్రచారాన్ని, దాడిని చేసారు! అన్నంపెట్టే రైతును దొంగలా చిత్రించే దుర్మార్గానికి ఒడిగట్టారు! కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వరుస చూస్తే..కోతలు కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్టు అర్థమైంది..! తిండి పెట్టే రైతుకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం ప్రారంభమైంది! విధివిధానాలు..మార్గదర్శకాలు ఏమీ సభలో చెప్పకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం అని ఒక మాట చెప్పి తప్పించుకుంది సర్కారు!

రైతన్నలారా...రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులు విధించి అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్ముల్ని నిండాముంచే ఒక పెద్ద దోఖా జరగబోతున్నది! అప్రమత్తంగా వుండాల్సిన సమయం ఇది..! మోసపోకుండా జాగ్రత్తగా వుండాల్సిన సందర్భం ఇది! స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం..ఏవో మాయోపాయాలు చేసి మమ అనిపించి పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టే ఘోరాలు చేయబోతున్నారు! అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త! వంచనను గ్రహించి ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన వేళ ఇది..! ఇప్పుడు మేల్కోకపోతే భరోసా వుండదు ..గోస మాత్రమే మిగులుతుంది!

ఉమ్మడి రాష్ట్రంలో సాగు సంక్షోభం లో మునిగి..వెన్ను విరిగిన తెలంగాణ అన్నదాతను ఆదుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక పాలసీలను పథకాలను ప్రవేశపెట్టింది.! తెర్లైన రైతు తేరుకున్నడు..ఆగమైన ఎవుసం బాగుపడ్డది! ముఖ్యంగా.. రైతుకు రంధి లేకుండా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చడంలో కీలక పాత్ర పోషించింది! రైతు ఎవరి ముందూ పెట్టుబడి కోసం చేయి చాచే దుస్థితి లేకుండా వానాకాలం.. యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే ఒక అపురూపమైన ఆలోచన ఆచరణే రైతుబంధు!

కుప్పకూలిన వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో తేడా చూప కుండా ప్రతి రైతుకూ పెట్టుబడి పైసలు ఇవ్వాలని నిర్ణయించాం! మొత్తం 11 సీజన్లలో 73 వేల కోట్ల రూపాయలను కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం! అవినీతికి..లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు! యావత్ ప్రపంచం మెచ్చింది..దేశంలో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి! అంతేకాదు… మరో 28వేల కోట్లు రుణమాఫీ కింద నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో పడ్డాయి! ఈ రెండు స్కీమ్ ల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో డైరెక్ట్ గా జమయ్యాయి! దుక్కి దున్నేవాడి దుఖం తీర్చాలన్న లక్ష్యంలో...రైతన్న మీద ప్రేమతో ఈ బృహత్ కార్యక్రమాన్ని అమలు చేసాం! ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని..పుట్లకొద్ది పంటలు పండించి లక్షల కోట్ల సంపద సృష్టించారు మీరు!

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లైనా అధికారంలోకి రావాలని అన్ని వర్గాలతో పాటు రైతాంగానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చిన హామీలను గుప్పించింది! కేసీఆర్ ఎకరానికి 10వేలే ఇస్తున్నడు.. మేం పవర్ లోకి వస్తే 15 వేలు ఇస్తామని వాగ్దానం చేసారు! రైతుభరోసా కింద ప్రతి ఎకరానికి ఏడాదికి 15వేలు ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు! గద్దెనెక్కిన వంద రోజుల్లో తప్పకుండా అమలు చేసి చూపిస్తామని గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి పంచారు! కాంగ్రెస్ పార్టీ గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది కాలం గడిచిపోయింది! ఇంతవరకూ రైతు భరోసా జాడా పత్తా లేదు! పదిహేను వేలు ఇయ్యలేదు సరికదా వున్న పదివేలను ఊడగొట్టారు! ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయాయి..మూడో సీజన్ కూడా వచ్చేసింది! ఈ వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టారు! నిన్న యాసంగి రూ.2500 కోత వేసారు! ఇప్పటి యాసంగి ఇస్తారో లేదో తెలియదు! మొత్తంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి 17,500 రూపాయలను బాకీ పడ్డది రేవంత్ రెడ్డి సర్కారు! అన్నదాతల ఖాతాల్లో పడాల్సిన పైసలు ఇవి! రైతులకు హక్కుగా రావాల్సిన సొమ్ము ఇది! వదులుకోవద్దు!

అందుకే ప్రతి రైతు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి! ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని చెబుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం! అందరి రైతులకు ఇస్తారా లేదా అని శాసన సభలో ప్రశ్నిస్తే సప్పుడు లేదు సమాధానం లేదు! పైగా రాళ్లూ రప్పలకు ఇచ్చి రైతుబంధు ఇచ్చి దుర్వినియోగం చేసారని అడ్డగోలు గా వాదించారు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు! సర్కారు వైఖరిని గమనిస్తే అర్థంలేని కొర్రీలు .. కోతలు పెట్టి అరకొరగా అమలు చేసి రైతు భరోసా ఇచ్చేసినం అని చెప్పి చేతులు దులుపుకోవాలని కుట్ర చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమైతున్నది! అసలు..కొత్తగా ఈ సంక్రాంతి తరువాత రైతు భరోసా వేసే రాగం ఎందుకు అందుకున్నారు? ఇప్పుడు వేసేది వానాకాలం పైసలా? యాసంగి పైసలా? ఏడాదికి ఒకే పంటకు ఇస్తారా.? రెండు పంటలకు వేస్తారా? ఈ కుట్రను కూడా రైతాంగం గుర్తించాలి! ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7500 కాదు..రూ.17500 అని అన్నదాతలు గట్టిగా అడిగితీరాలి!

రైతు భరోసా విధి విధానాలు నిర్ణయిస్తామని కేబినెట్ సబ్ కమిటీ వేసి కాలయాపన చేసారు! జిల్లాల్లో సదస్సులు పెట్టి అభిప్రాయ సేకరణ అంటూ ఇంకొంత కాలం సాగదీసారు! ఎన్నికల ముందు ఎవరి అభిప్రాయాలు తీసుకొని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15వేలు ఇస్తామన్నారు..? ఇప్పుడెందుకు ఈ నాటకాలు! ఎన్నికలు ఏరుదాటగానే తెప్ప తగలేస్తున్నారా? గత ఏడాది కాలంగా లీకులు ఇస్తూ ఇన్‌ కం టాక్స్ కట్టేవాళ్లకు పాన్ కార్డు వున్న వాళ్లకు రైతుబంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించారు! లక్షలాది మంది ఉద్యోగులకు ఇక భూమితో బంధం తెంపేస్తారా? బ్యాంకు లోన్లు సులభంగా రావడం కోసం ఐటీ చెల్లించి.. పాన్ కార్డు తీసుకున్న వాళ్లందరి నోట్లో మన్నుకొడతారా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో కుతంత్రం కూడా చేస్తున్నది! కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసా కూడా వర్తింపజేస్తామని చెబుతున్నారు! అదే..గనుక జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు! 70 లక్షలకు పైగా రైతన్నలు వుంటే..30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదు! ప్రతియేటా లబ్ధిదారుల సంఖ్య పడిపోతూనే వుంది! పీఎం కిసాన్ గైడ్ లైన్స్ పెద్ద దగా.. కాంగ్రెస్ దగాకోరులు ఢిల్లీలో పీఎం కిసాన్ మార్గదర్శకాలు వద్దంటారు..గల్లీలో వాటినే ముద్దంటున్నారు!

ఇప్పటికే బడేభాయ్ బాటలోనే చోటే భాయ్ నడుస్తున్నడు..రైతు భరోసా విషయంలో కూడా ఆ తోవలోనే పోతే.. 40 లక్షల మంది పైగా అన్నదాతలకు మొండిచెయ్యే గతి! రైతు బంధు మీద కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారం అంతా.. రైతు భరోసాకు కోతలు పెట్టే దురుద్దేశంతో చేస్తున్నదే! రూ. 22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు .. క్రషర్లుకు ఇచ్చారని దుష్టబుద్ధితో దుర్మార్గమైన ప్రచారం చేస్తూ రైతులను అవమానిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం! వాస్తవం ఏంటంటే..వానాకాలంలో పోల్చితే యాసంగిలో సాగు తగ్గుతుంది! పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లు వేయడం సాధ్యంకాదు! కేసీఆర్ ప్రభుత్వం నాడు.. యాసంగిలో కూడా వానాకాలం లెక్క ప్రకరామే రైతుబంధు పైసలు జమ చేసింది! యాసంగిలో వేసిన రైతు బంధు పైసలను దుర్వినియోగం లెక్కల్లో వేసి అన్నదాతలను దొంగలుగా చేసి చూపుతున్నారు..కాంగ్రెస్ గజదొంగలు!

ఇప్పుడు సీఎంగా వున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో వున్నప్పుడు రెండు పంటలకు కాదు.. మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని మయాదారి ముచ్చట్లు చెప్పాడు! ఆ మనిషే ఇప్పుడు.. రెండో పంటకు ఇచ్చిన రైతుబంధుపై తప్పుడు ప్రచారం చేసి కర్షకులను కించ పర్చేలా మాట్లాడుతున్నడు! ఖజానాలో సొమ్మంతా రైతు కొల్లగొట్టినట్టు ప్రచారం చేయడం సమంజసమా? ఐదెకరాలు లోపే ఇస్తామని.. పంటలు వేసారో లేదో సర్వేలు చేసి డబ్బులు వేస్తామని అన్నం పెట్టే రైతు మీద ఆంక్షలు పెట్టడం అనుమానించడం న్యాయమా? బక్క రైతుకే ఎందుకు ఇన్ని షరతులు..! అన్నంపెట్టే వాళ్లంటే అంత అలుసా? ఎన్నికల ముందు.. అందరికీ అన్నీ అని చెప్పి..ఇప్పుడు కొందరికే అని మాట మార్చడం నీతిలేని నీచమైన మోసం కాదా? నిజానికి..రైతుబంధు లబ్ధి దారుల్లో 80 శాతం దళిత గిరిజన బహుజన రైతులే వున్నారు! పదెకరాలు పైబడి వున్న రైతులు 1.3 శాతం మంది మాత్రమే వున్నారు! బీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ లెక్కలను పక్కాగా తేల్చింది! ఈ వాస్తవాలను కప్పిపుచ్చి.. రైతుబంధు మీద తప్పుడు ప్రచారం అందుకున్నారు!

పంట పెట్టుబడి రైతు హక్కు.. భిక్ష కాదు! రైతుకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే! విత్తు వేసిన నాటి నుంచి పంట అమ్మేదాకా ఎన్ని గండాలో రైతుకు! రాష్ట్రంలో 47 శాతం మందికి ఉపాధినిచ్చే పెద్ద పరిశ్రమ వ్యవసాయం! రెతులు రైతు కూలీల బతుకుదెరువు బాగుండాలంటే వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాల్సిందే కదా! రైతన్నకు ఇచ్చే సాయాన్ని దానధర్మంగా చూడొద్దు.. భారంగా చూడొద్దు బాధ్యతగా చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి.. నాడు ప్రతిపక్షంలో వున్నప్పుడు 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి పైసలు గ్యారెంటీ ఇస్తామని బహిరంగ లేఖ రాసాడు! అసలు రైతుతో పాటు..కౌలు తీసుకున్న రైతుకు కూడా ఎకరానికి 15వేలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు! ఆ 22 లక్షల మంది కౌలు రైతులు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం..! సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా కౌలు రైతులకు పడుతుందో లేదా అని అడిగితే సర్కారు నుంచి సమాధానం లేదు!

చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కారు ఎత్తులను నక్కజిత్తులను తిప్పికొట్టాలి! గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు గల్లా పట్టి నిలదీయాలి..! నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలి! రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలి! మౌనంగా వుంటే దగా పడతాం..! నోరు విప్పకుంటే అన్యాయమైపోతాం..! సాధించుకున్న పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుంది!

మీతో కలిసి మేము నడుస్తాం..! మీ ఆందోళనకు అండగా వుంటాం..! నమ్మించి నట్టేట ముంచే వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ ను పల్లెల్లో దంచికొడదాం..! కొట్లాట మనకు కొత్తగాదు, బీఆర్ ఎస్ అంటే.. భారత రైతు సమితి..! రైతుకు కేసీఆర్ సర్కారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబళిస్తుంటే చూస్తూ వూరుకోం..!

మేలుకో.. తెలంగాణ రైతన్న!

జై కిసాన్..జై తెలంగాణ!

Tags:    
Advertisement

Similar News