2024 సంవత్సరం తెలంగాణ బీజేపీకి మధురస్మృతి : కిషన్ రెడ్డి
బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు
2024 సంవత్సరం తెలంగాణ భారతీయ జనత పార్టీకి మధురస్మృతులను మిగిల్చింది అని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో కమలం పార్టీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ప్రధాని మోదీకి, బీజేపీకి మీరు అందించిన మద్దతు వల్ల మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందింది. రాష్ట్రంలో పోలయినటువంటి మొత్తం ఓట్లలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం ఓట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపింది.
అంతేకాదు, బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్రమోదీ సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యాలకు తోడు రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, బాధితులకు భరోసానిస్తూ, బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. బీజేపీ పట్ల మీరు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు 2025 లోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.