మూసీ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం 15 వేల ఇండ్లు కేటాయించింది

రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోఖన్‌ సాహు

Advertisement
Update:2024-11-27 22:07 IST

తెలంగాణ ప్రభుత్వం మూసీ నిర్వాసితులకు 15 వేల ఇండ్లు కేటాయించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోఖన్‌ సాహు తెలిపారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పక్షనేత కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. దీనిలో భాగంగా నదికి పునరుజ్జీవం తేవడం, కాలుష్యాన్ని నివారించడం, హైదరాబాద్‌ నగరంలో వరదలను నియంత్రించడం, నది జీవావరణాన్ని పునరుద్దరించడం అనే లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు విస్తృతమైన కూల్చివేతలు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ తో నిరాశ్రయులయ్యే వారికి పూర్తి పారదర్శకంగా పరిహారం అందిస్తుందని తెలిపారు. ల్యాండ్‌ అక్విజేషన్‌, రిహాబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ రూల్స్‌ 2014కు అనుగుణంగా నిరాశ్రయులకు పరిహారం అందజేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‌ బెడ్‌తో పాటు బఫర్‌ జోన్‌ లో నివాసం ఉంటున్న వారికి మానవత దృక్పథంతో ఇప్పటికే 15 వేల ఇండ్లను కేటాయించిందని తెలిపారు. నిరాశ్రయులకు జీవనోపాధి కల్పించేందుకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశామని.. నిర్వాసిత కుటుంబాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తమకు తెలియజేసిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు.



Tags:    
Advertisement

Similar News