నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర వేసి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Advertisement
Update:2024-05-03 10:58 IST

ఓటుకు నోటు కేసుపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో విచారణను భోపాల్‌ కోర్టుకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సతీష్‌చంద్ర బిశ్వా, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు విచారణను భోపాల్‌ కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై నేడు అత్యున్న‌త‌ ధర్మాసనం విచారణ చేయనుంది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర వేసి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించిన ఘటనలో రేవంత్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పటి ఘటనలో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి నేరుగా డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అంతేకాదు.. స్టీఫెన్‌సన్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడిన ఆడియోను కూడా ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ‘మనోళ్లు బ్రీఫ్డ్‌ మి’ అనే వాయిస్‌ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ నివేదికలో నిర్ధారణ కూడా అయింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ పిటిషన్‌ దాఖలైంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ధర్మాసనం విచారణ చేయనుంది.

Tags:    
Advertisement

Similar News