ఆటో డ్రైవర్ల ధైర్యాన్ని కోల్పోవద్దు..అండగా బీఆర్‌ఎస్ : కేటీఆర్
ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయల్దేరారు.
తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కారించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు బయల్దేరారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత శాసన సభ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు.
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్‌కు ఏటా 12వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని స్పీకర్‌ని కేటీఆర్ కోరారు.