విద్యారంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Update:2024-10-15 17:56 IST

తెలంగాణ విద్యారంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు, ప్రైవేట్‌ విద్య కూడా విద్యార్థులకు అందకుండా చేస్తోందన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించే గురుకులాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, భద్రత లేకుండా చేశారని, కనీసం భవనాలకు అద్దెలు కూడా చెల్లించడం లేదన్నారు. గురుకుల భవనాలకు యజమానాలు తాళాలు వేసే దుస్థితి తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులా పరిస్థితి ఇలా ఉంటే ఫీ రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి బిడ్డలను చదువులకు దూరం చేయడమే ఈ ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్‌ చేస్తున్నాయని, ఇంతకన్నా సిగ్గు చేటు ఏముంటుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసినా ఫీ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌ లు కూడా ఇవ్వడం లేదంటే విద్యార్థులపై ప్రభుత్వానికి ఏపాటి ప్రేమ ఉన్నదో తేటతెల్లమవుతుందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తోన్న ప్రభుత్వానికి పేద, మధ్య తరగతి విద్యార్థుల చదవుల కోసం ఖర్చు చేసేందుకు డబ్బు లేదా అని నిలదీశారు. తెలంగాణ ఏర్పడే నాటికే రూ.2 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంటే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించిందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరపాలని, వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ లు రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డికి పరిపాలన అనుభవం లేదని, పేదల బాధలు తెలియకపోవడంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని, ఆ శాఖ చూస్తున్న ముఖ్యమంత్రికి విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాల బాధలు తెలుసుకునే ఓపిక లేకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News