సర్వేకు దూరంగా ఉన్న 3 శాతం పెద్ద విషయమేమీ కాదు
కులగణన ప్రక్రియపై ఎవరైనా విమర్శలు చేస్తే అది నేరుగా బలహీనవర్గాలపై దాడిగానే భావిస్తామన్నమంత్రి పొన్నం
కులగణనపై విమర్శలు బలహీనవర్గాలపై దాడిగానే భావించాల్సి ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వలస వెళ్లిన వాళ్లు సమాచారం ఇవ్వడానికి విముఖత చూపారన్న మంత్రి 3 శాతం తేడా పెద్ద విషయం కాదన్నారు. సర్వేపై అనుమానాలు ఉంటే రేపటి అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా కులగణనపై విమర్శలను మంత్రి ఖండించారు. సమాచార సేకరణ శాస్త్రీయంగా, చట్టపరంగా జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి వచ్చినా కొందరు కావాలనే సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ప్రక్రియ ఒక కాలపరిమితిలో జరిగిందని, అందులో ఎవరి వివరాలు నమోదు కాకపోతే సంబంధిత ఆఫీసులలో ఇవ్వాలని కోరాం. కానీ అవేవీ చేయకుండా సహాయ నిరాకరణ లాగా కనపడకుండా చేసి ఈ ప్రక్రియపై ఎవరైనా విమర్శలు చేస్తే అది నేరుగా బలహీనవర్గాలపై దాడిగానే భావిస్తామన్నారు. మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మిగతా రాజకీయ పార్టీలను వైఖరి కూడా చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి న్యాయం చేయలేని, ఇప్పటికీ సొంతపార్టీలోని బీసీలకు న్యాయం చేయని వారు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తగని మంత్రి అన్నారు. సర్వేపై అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.