చంద్రబాబుకి వెన్నుపోటు.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికలతో కడియం శ్రీహరి కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని చెప్పారు రాజయ్య.

Advertisement
Update:2024-04-30 16:15 IST

వెన్నుపోటు అనే పదం వినపడితే అందరికీ చంద్రబాాబు గుర్తుకు రావడం సహజం. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కొని ఆయన్నే అందులోనుంచి గెంటేసిన ఘనడు చంద్రబాబు. అయితే ఆ చంద్రబాబుకి కూడా వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కడియం శ్రీహరి అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి రాజయ్య. ఎన్టీఆర్, చంద్రబాబు.. ఇద్దరికీ కడియం వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కూతురి రాజకీయ జీవితం కోసం ఆయన ఊసరవెల్లి అవతారం ఎత్తారని మండిపడ్డారు. ఎన్ కౌంటర్లు చేయించిన చరిత్ర కడియంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజయ్య.

లోక్ సభ ఎన్నికలతో కడియం శ్రీహరి కుటుంబం శాశ్వతంగా రాజకీయ సమాధి అవుతుందని చెప్పారు రాజయ్య. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అని పేర్కొన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్లానని చెప్పుకోడానికి కడియంకు సిగ్గుండాలని అన్నారు. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన ఆయన వరంగల్ జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు రాజయ్య.

కడియం వర్సెస్ రాజయ్య..

బీఆర్ఎస్ లోకి రాగానే కడియం తన పదవులకు ఎసరు పెట్టారని మండిపడ్డారు రాజయ్య. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పనులకు అడ్డుపుల్ల వేసిన ద్రోహి కడియం అని విమర్శించారు. కడియం కులంపై సిట్టింగ్ జడ్జితో రేవంత్ విచారణ జరిపించాలన్నారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు మాత్రమే కడియం వెంట ఉంటారన్నారు. దమ్ముంటే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని అప్పుడు తేల్చుకుంటామని అన్నారు రాజయ్య. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్య సిట్టింగ్ స్థానాన్ని కడియంకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రాజయ్య సపోర్ట్ తో గెలిచిన కడియం వెంటనే ప్లేటు ఫిరాయించారు. కడియం కుమార్తెకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. దీంతో రాజయ్యకు మళ్లీ బీఆర్ఎస్ లో ప్రాధాన్యత పెరిగింది. వరంగల్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు రాజయ్య ప్రచారం చేస్తున్నారు. కడియంపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News