మా టార్గెట్‌ అదే.. విజన్ ఆవిష్కరించిన కేటీఆర్

వచ్చే ఐదేళ్లలో సిటీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని.. వాటన్నింటిని పటాపంచలు చేశామన్నారు.

Advertisement
Update:2023-11-11 17:29 IST

మా టార్గెట్‌ అదే.. విజన్ ఆవిష్కరించిన కేటీఆర్

తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. తెలంగాణను పరిణితి చెందిన రాష్ట్రంగా అభివర్ణించిన కేటీఆర్‌.. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో 24X7 తాగునీటి సరఫరాను స్థిరీకరిస్తామన్నారు. JRC కన్వెన్షన్‌ సెంటర్‌లో హైదరాబాద్‌ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వచ్చే ఐదేళ్లలో సిటీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవని.. వాటన్నింటిని పటాపంచలు చేశామన్నారు.

2036 నాటికి హైదరాబాద్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలన్నది తన ఆకాంక్ష అన్నారు కేటీఆర్. అందుకోసం అత్యాధునిక క్రీడా మైదానం అవసరం ఉందన్నారు. సిటీలో వీధి కుక్కల సమస్య ఉన్న మాట వాస్తవమేనన్న కేటీఆర్‌.. వాటిని అమానవీయంగా చంపలేమన్నారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుకు స్టెరిలైజేషన్ చేస్తున్నామన్నారు. నాన్‌-వెజ్‌ మార్కెట్లలో పడేసే వ్యర్థాల వల్ల వీధి కుక్కలు క్రూరంగా మారుతున్నాయని, అందువల్ల నాన్‌-వెజ్‌ మార్కెట్‌ వ్యర్థాలను శాస్త్రీయంగా డిస్పోస్‌ చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.


1500 స్వచ్ఛ్‌ ఆటోల ద్వారా వ్యర్థాల సేకరణ, నిర్వాహణను మెరుగుపరుస్తామన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రస్తుతం 24 మెగావాట్లుగా ఉందని.. దాన్ని 100 మెగావాట్లకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు కేటీఆర్. సిటీలో భవన నిర్మాణాల వ్యర్థాల కోసం 6-8 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సిటీలో 32 చెరువులను సుందరీకరించామని.. మొత్తం 180 చెరువులను అదే పద్ధతిలో సుందరీకరిస్తామని వివ‌రించారు. మెట్రోను మాల్స్‌ను కలుపుతూ స్కైవాక్‌ల నిర్మాణం చేపడతామన్నారు.

రాబోయే రోజుల్లో మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు కేటీఆర్. ట్రాఫిక్‌ తగ్గాలంటే మెట్రో సేవలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో GHMCకి ఒక కమిషనర్ సరిపోరన్న కేటీఆర్.. మరో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను నియమిస్తామన్నారు. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూస్తారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News