జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే : హైకోర్టు
జీహెచ్‌ఎంసీలో చెరువుల బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ నిర్ధరించే వరకు పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని చెరువుల బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ నిర్ధరించే వరకు పూర్తి పర్యవేక్షణ తమదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలపగా.. వాటన్నింటికీ బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.
హెచ్‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులున్నాయని ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు.530 చెరువులకు తుది నోటిఫికేషన్లు పూర్తయినట్టు వెల్లడించారు. 3 నెలల్లోగా హైదరాబాద్ పరిధిలోని అన్ని చెరువులకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబరు 30కి వాయిదా వేసింది.